టీఆర్ఎస్ ఆఫీసులో గన్ కలకలం
posted on Mar 21, 2021 @ 1:29PM
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయంలో తుపాకి కలకలం రేగింది. తెలంగాణ భవన్‌లో గన్ తో ఓ నేత హల్ చల్ చేశాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుపాకితో టీఆర్ఎస్ నాయకుడు హల్ చల్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ గన్‌తో హల్‌చల్ చేశారు. టీఆర్ఎస్ భవన్ దగ్గర జరిగిన సంబరాల్లో భాగంగా.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు కట్టెల శ్రీనివాస్ యత్నించారు. అయితే పక్కనున్నవారు ఆపడంతో.. వెంటనే తేరుకున్న శ్రీనివాస్ దాన్ని జేబులో పెట్టుకున్నారు.
టీఆర్ఎస్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్.. తుపాకిని చేతిలో పట్టుకుని కాల్చాలనే ప్రయత్నం చేసిన విజువల్స్ ,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ సంబరాల్లోనే మరో అపశృతి కూడా జరిగింది. కార్యకర్తలు అత్యుత్సాహంతో క్రాకర్స్ కాల్చగా.. నిప్పు రవ్వలు పడటంతో తెలంగాణ భవన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం పై కప్పు తగలబడింది. ఈ ఘటన కూడా కలకలం రేపింది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి. .మంటలు విస్తరించకుండా అదుపు చేశారు.