వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ
posted on Jul 27, 2022 @ 3:29PM
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు.. ఇది తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నమ్మిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రాతిపదికనే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇప్పటికీ ఆయన ప్రారంభించిన పార్టీ ఆ సిద్ధాంతాన్ని విడవ లేదు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తూనే ముదుకు సాగుతోంది. తెలుగు ప్రజలకు కష్ట సమయంలో అండగా నిలుస్తోంది. తోడుగా నడుస్తోంది.
ఇప్పుడు కూడా గోదావరికి భారీగా వచ్చిన వరద గ్రామాలకుగ్రామాలను ముంచెత్తి ప్రజలను ఇక్కట్ల పాలు చేసిన సమయంలో ప్రజలకు అండగా నిలుస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్. ట్రస్ట్ ద్వారా వరద బాదితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం, తాగు నీరు, మందులు సహా నిత్యావసర వస్తువుల సరఫరా చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే బాధితులకు అవసరమైన సరుకుల్ని ఇప్పటికే ఆయా ప్రాంతాలకు తరలించి సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాల అమలుపై ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఈవో రాజేంద్రప్రసాద్ బుధవారం ( జూలై 27) సమీక్షించారు.
ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయ సహకారాలు అందించడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా నారా భువనేశ్వరి తెలిపారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే తమ సిద్దాంతమన్నారు. గోదావరి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 8వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు, పిల్లలకు పాలు అందించామన్నారు. అదే స్ఫూర్తితో మిగిలిన వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్కర సమయాల్లో ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు.