ఎవరి అవిశ్వాసం వారిదే
posted on Mar 14, 2013 7:41AM
ఎవరి (అ) విశ్వాసం వారిదే తెరాస అధినేత కేసీఆర్ అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం పెట్టినప్పటి నుండి ఇంతవరకు స్థబ్దుగా ఉన్న రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఈ సారి ప్రతిపక్షాలు చేస్తున్న అవిశ్వాస తీర్మాన ఆలోచనలో చాల ప్రత్యేకత ఉంది. సాధారణంగా ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రసక్తి తేగానే ఉలిక్కిపడవలసిన రాష్ట్ర ప్రభుత్వం నిశ్చింతగా తనపని తానూ చేసుకుపోతుంటే, ఆ ప్రతిపాదన తెచ్చిన విపక్షాలు మాత్రం తమలో తాము కీచులాడుకోంటూ ప్రజల ముందూ నవ్వులపాలవుతున్నాయి. అవిశ్వాసం వల్ల తమ ప్రభుత్వం పడిపోతుందని భయపడవలసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రతిపక్షాల కీచులాటలు చూసి అవహేళన చేస్తోంది. అయినా ప్రతిపక్షాలు తమ అవిశ్వాస పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
ఇక, తాజా వార్తా ఏమిటంటే ఇంతవరకు తెరాస పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ, తెలుగుదేశం పార్టీని నిలదీస్తూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, అకస్మాత్తుగా తన వ్యూహం మార్చుకొని, తానే స్వయంగా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకొంది. తెరాస ‘తెలంగాణా అంశం’ ప్రధానంగా చేసుకొని అవిశ్వాస తీర్మానం పెడుతున్నందున, తాము దానికి మద్దతు ఇస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో అది తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ అభిప్రాయపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. కానీ, ఆ విషయాన్నీ బహిరంగంగా ప్రకటిస్తే తెరాస తమపై యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది గనుక, ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగు దేశం పార్టీ తన బాధ్యతలను విస్మరించినందువల్లే తాము ఆ బాధ్యతలు స్వీకరిస్తూ స్వయంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకొన్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు చెప్పుకొంటోంది.
అందువల్ల ఈ రోజు తెరాస వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాయి. తత్ఫలితంగా ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో ఆ రెండు పార్టీలు కూడా చేతులు కలిపే ఆలోచన లేదని స్పష్టం చేసాయి.
గనుక, ఈ అవిశ్వాస తీర్మానాలవల్ల కిరణ్ సర్కార్ కు వచ్చే ప్రమాదం ఏమిలేకపోగా వాటివల్లనే ఆయన ప్రభుత్వం రాజకీయ లబ్దికూడా పొందగలదు కూడా. ఐదు సం.లు పాలించమని ప్రజలు ఎన్నుకొన్న తమ ప్రజా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఈ విధమయిన స్వీయ రాజకీయప్రయోజనాల కోసం అన్యాయంగా పడగొట్టేందుకు విఫలయత్నాలు చేశాయని కిరణ్ సర్కార్ రేపటి నుండి ప్రచారం చేసుకొని ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చును. కానీ, ఐకమత్యం లోపించిన ఆపార్టీ ఈ సదవకాశాన్ని పూర్తిగా ఉపయోగించు కోలేకపోవచ్చును.
ఇక, ఇంతవరకు తెలుగు దేశం పార్టీని అవిశ్వాస తీర్మానంపై నిలదీస్తూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెరాస ప్రతిపాదిస్తున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఈయకుండా ఇప్పుడు తాను కూడా వేరేగా అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా, నిజంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతున్నట్లు కేవలం రాజకీయ లబ్ధికోసమే ఈ డ్రామాలు ఆడుతునట్లు ఆ రెండు పార్టీలు కూడా ఋజువు చేసాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ మాట వర్తిస్తుంది. నిజంగా ఆపార్టీకి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనే ఉంటే తెరసాతో చేతులు కలిపి ఆ పని చేసి ఉండాలి. కానీ, శాసన సభలో తన తీర్మానానికి తగిన మద్దతు కూడా లేదని, తన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసికూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంలోనే ఆ పార్టీకి ఈవిషయంలో చిత్తశుద్ది లేదని నిరూపిస్తోంది.
తెరాస తన అవిశ్వాస తీర్మానం ‘తెలంగాణా అంశం’ పై అని ప్రకటించడం ద్వారా, ప్రధాన ప్రతిపక్షలయిన తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ముందే ఒక లక్ష్మణరేఖ గీసి, తనతో చేతులు కలపకుండా జాగ్రత్త పడింది. ‘తెలంగాణా అంశం’ పెడితే ఆ రెండు పార్టీలు తమతో చేతులు కలపవని తెలిసి కూడా తెరాసా ఆవిధంగా చేయడం గమనించినట్లయితే, ఆ పార్టీకి కూడా నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదని అర్ధం అవుతోంది. కేవలం స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసమే ఆ పార్టీ ఈ అవిశ్వాస ఆలోచలు చేసినట్లు స్పష్టం అవుతోంది.
ఇక, ఈ రెండు పార్టీల డ్రామాలు,వ్యూహాలను ముందుగానే ఊహించినందువల్లనో లేక ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ సర్కారును కూల్చడం ఇష్టం లేకనో తెలుగు దేశం పార్టీ మొదటి నుండే ఈ అవిశ్వాస ఆలోచనలకు దూరంగా ఉండిపోయింది. ఇక, ఈ అవిశ్వాస ఆలోచనలు చేసిన తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలే అందరి ముందు నవ్వులుపాలు అవబోతుండగా, వారినిరువురినీ ఎదుర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి దైర్యవంతుడిగా మరో మారు నిరూపించుకోబోతున్నారు.
ఈ రాజకీయ అవిశ్వాస పోరాటాల నుండి చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటపడినప్పటికీ ద్వంద ప్రమాణాలు అవలంబిస్తునందున ఆయన నమ్మదగిన వ్యక్తి కాదని విపక్షాలు చేస్తున్న ప్రచారం వలన చాలా అపఖ్యాతి మూట గట్టుకోకతప్పలేదు. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, ఈ అవిశ్వాస తీర్మానాల వలన కిరణ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం నష్టం కలుగకపోగా ఊహించని మేలు జరిగింది. ఆయన చెప్పినట్లు ఇక 2014 ఎన్నికల వరకు ఆయన ప్రభుత్వానికి డోకాలేదని భావించవచ్చును.