ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు: కాంగ్రెస్

 

రాష్ట్రంలో మూడు ప్రధాన ప్రతిపక్షలయిన తెదేపా, తెరాస మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇటీవల కాలంలో ఎదుట పార్టీ వారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కుమ్మకయ్యారనే ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణ విషయం అయిపోయింది. కానీ, ఈ ఆరోపణలపై కాంగ్రెస్ మాత్రం ఇంత వరకు ఎన్నడూ ఖచ్చితంగా స్పందించలేదు. ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న 9 మంది జగన్ మోహన్ రెడ్డి అనుకూల వర్గానికి చెందిన శాసన సభ్యుల అండతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుండటం చేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏమి అనలేని నిస్సహాయ స్థితిలో ఉంది.

 

అటువంటప్పుడు, తెదేపా, తెరాసలు ఒకరిపై మరొకరు తమ పార్టీతో రహస్య ఒప్పందాలు చేసుకొన్నాయని ఆరోపణలు గుప్పించుకొంటున్నపుడు, వారి మద్యలో దూరి భంగపడే బదులు, వారిని ఆవిధంగానే కీచులాడుకోనిస్తేనే తమకు మేలని కాంగ్రెస్ భావించి ఉండవచ్చును. ప్రతిపక్షాల అనైక్యతే తమ పార్టీకి శ్రీరామరక్ష అని కాంగ్రెస్ పార్టీ గ్రహించడం వల్లనే వారి ఈ కీచులాటలలో కలుగజేసుకోకుండా దూరంగా మసులుతోంది.

 

కాంగ్రెస్ ప్రభుత్వాని కూల్చిపడేస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసిన తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు కిరణ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఒకేసారి రెండు వేర్వేరు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి, ప్రభుత్వాన్నికూల్చలేదు సరికదా వారే కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీరామరక్షగా నిలిచారు. ఇక తెలుగు దేశం పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీని ప్రజల మద్య ఎన్ని తిట్లు తిట్టినా, తమ ప్రత్యర్ధ పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లో తమవల్ల ప్రయోజనం దక్కకూడదనే ఏకైక ఆలోచనతో అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీకూడా శ్రీరామరక్షగా నిలిచింది.

 

ఈ పరిణామాలను బట్టి ప్రతిపక్షాల అనైక్యత కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు చేస్తోందో అర్ధం అవుతుంది. రాబోయే ఎన్నికల సమయంలో కూడా బహుశః ఈ పరిస్థితులే గనుక కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు పేరుపేరునా కృతజ్ఞలు చెప్పుకోక తప్పదు.