40 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ హుష్ కాకీ!?
posted on Jul 22, 2023 @ 2:08PM
ఏపీలో కూడా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో ఎనిమిది నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఎనిమిది నెలలు మరో లెక్క. అందుకే రాజకీయ పార్టీల అధినేతలు బుర్రలకు పదును పెడుతున్నారు. తమ పార్టీలో ఏం జరుగుతుంది? రానున్న ఎన్నికలలో మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు తెప్పించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. అప్పుడే ఆ ఎమ్మెల్యేలకు క్లాసులు కూడా పీకారు. వారిలో ఎందరిలో మార్పు వచ్చిందో.. ఎందరిలో మార్పు రాలేదో తెలియదు కానీ.. కనీసంలో కనీసం 40 మంది ఎమ్మెల్యేలకు మాత్రం వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవని తేటతెల్లమైపోయినట్లు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.
పర్ఫామెన్స్ వీక్ ఉన్న వారందరికీ ఇప్పటికే ఒకసారి తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించి మరీ చక్కదిద్దుకోవాలని హెచ్చరించారు. ఇకనైనా పని తీరు మార్చుకోకపోతే టికెట్లు ఇవ్వడం కష్టమేననని కూడా అప్పుడే తేల్చేశారు. అప్పట్లోనే ఓ 20 మంది ఎమ్మెల్యేలకు అయితే అసలు టికెట్లు ఇచ్చేది లేదని కూడా చెప్పగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి 40కి చేరినట్లు తెలుస్తున్నది. ఎన్నికలకు కేవలం నెలల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ ఫైనల్ సర్వేకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటిదాకా చేసిన సర్వేలు ఒక ఎత్తు.. ఈసారి జరుగుతున్న సర్వే మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సర్వే ఫలితాన్ని బట్టే టికెట్ల కేటాయింపు ఉంటుందని అంటున్నారు.
ఇప్పటిదాకా ఐ ప్యాక్ టీం నుండి మరికొన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా తెప్పించుకున్న సర్వే రిపోర్టులు వైసీపీ అధినేత జగన్ వద్ద ఉండగా.. ఇప్పుడు వాటితో పాటు పార్టీ పరంగా సర్వేలు, వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు కూడా చేయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి కూడా ఎప్పటికప్పుడు సర్వేలు అందుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ వడపోసి ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ ఫైనల్ రిపోర్ట్ ఆధారంగానే వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తున్నది. అయితే, ఈ ఫలితాలు వైసీపీ నేతలకు షాక్ ఇస్తున్నాయట. అన్ని సర్వేలను క్రోడీకరించగా వచ్చిన ఫలితాలలో 50 నుండి 60 మంది అభ్యర్థులపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిందని చెబుతున్నారు. వీరిలో కొందరు సీనియర్ లు, మాజీ మంత్రులు కూడా ఉండగా.. మరికొందరు అసలు ఇప్పటి వరకూ ప్రజలలోకి వెళ్లని వాళ్ళు ఉన్నారట.
సీఎం జగన్ మోహన్ రెడ్డి కాకుండా గత ఎన్నికలలో వైసీపీ నుండి 150 ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో రెబల్స్ గా మారనీ.. పార్టీకి దూరమవనీ.. అంటీముట్టనట్లుగా ఉండనీ.. దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు వైసీపీ ఖాతాలో లేరు. మిగిలిన 140 మందిలో 60 మంది ఎమ్మెల్యేలపై ప్రజలలో అసంతృప్తి ఉంది. ఇక మిగిలింది 80 మంది మాత్రమే. అందుకే వైసీపీ ఇప్పుడు 60 మంది పనితీరు సరిగా లేని ఎమ్మల్యేలలో 40 మందిని అనివార్యంగా మార్చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. అదే జరిగితే ఈసారి సీనియర్లు, మాజీ మంత్రులలో కొందరికి టికెట్లు దక్కని పరిస్థితి ఉంది. కాకపోతే వీరిలో ఎంతమంది రెబల్స్ గా మారి పార్టీకి నష్టం చేస్తారనే దానిపైనే వైసీపీ అధిష్టానం లెక్కలేసుకుంటోందని చెబుతున్నారు. అన్నట్లు ఈ నెలాఖరు లోపు ఈ సర్వే ఆధారంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో మరో సారి సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.