బండికి తలంటు..బీజేపీలో అదే అయోమయం!
posted on Jul 22, 2023 @ 1:56PM
తెలంగాణ బీజేపీ పరిస్థితి అయోమయంగా మారింది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారం మాదే అన్న స్థాయిలో బిల్డప్ ఇచ్చిన ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కూడా ప్రశ్నార్థకమైపోయిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లుగా కాకుండా బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది.
ఆ సభలో బండి సంజయ్ తనలోని అసంతృప్తిని, అసమ్మతిని, ఆవేదనను వెళ్లగక్కితే.. సభలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభృతులు బండికి అండగా నిలబడతామని ఉద్ఘాటించారు. సభకు హాజరైన కార్యకర్తలు కూడా బండికి అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఈటల టార్గెట్ గానే బండి ప్రసంగం సాగిందని పార్టీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్నది. బండికి వ్యతిరేకంగా బీజేపీ హైకమాండ్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినది ఈటలేనని అర్ధం వచ్చేలా బండి ప్రసంగం సాగిందని అంటున్నారు. మొత్తంగా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన సభ వల్ల బీజేపీలో ఉన్న లుకలుకలను, వర్గ విభేదాలను మరోసారి బహిర్గతం చేసిందనడంలో సందేహం లేదు.
అంతే కాదు.. ఈ సభ బీజేపీకి పూడ్చుకోలేనంతగా నష్టం కూడా చేకూర్చింది. కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ముళ్ల కిరీటమేనన్నది సందేహాలకు అతీతంగా తేటతెల్లం చేసింది ఈ సభ. దీంతో బీజేపీ అధిష్టానం కంగుతింది. దీంతో బండి సంజయ్ ను మందలించింది. నా పని అయిపోయింది, కనీసం కిషన్ రెడ్డిని అయినా ఆయన పని ఆయనను చేసుకోనివ్వండి.. అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయకండి అంటూ బండి వ్యాఖ్యలపై బండిని ప్రశ్నించడమే కాకుండా పార్టీకి నష్టం చేకూర్చేలా మాట్లాడవద్దని సుతిమెత్తగా క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. దీంతో బండి సంజయ్ మరింతగా మనస్తాపం చెందారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.