మూడు రాజధానుల బిల్లు ఇక అంతేనా? జగన్ వెనకడుగు వేశారా?
posted on Sep 17, 2022 7:10AM
అంతన్నారింతన్నారు.. చివరకు స్వల్ప కాలిక చర్చతో సరిపెట్టేశారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానులపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ప్రసంగించారు. అంతే మూడు రాజధానుల బిల్లు విషయంలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చర్చ జరుగున్నప్పుడు కానీ, చర్చ ముగిసిన తరువాత కానీ ఉపసంహరించుకున్న మూడు రాజధానుల బిల్లును న్యాయపరమైన చిక్కులు లేకుండా మళ్లీ సభలో ప్రవేశపెడుతున్నామన్న మాట చెప్పాలేదు.
వికేంద్రీకరణే విధానమని పదే పదే చెప్పిన సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు గురించి మాటమాత్రమైనా చెప్పలేదు. కానీ అసెంబ్లీ సమావేశాలకు ముందు మాత్రం వైసీపీ వర్గాలు ఈ సమావేశాలలోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమన్నట్లుగా ప్రచారం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదా సిద్ధంగా ఉందనీ, బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందడమే తరువాయి అనీ గట్టగా ప్రచారం చేసుకున్న వైసీపీ బిల్లు ప్రవేశపెట్టే విషయంలో వెనక్కు తగ్గింది.
బిల్లు ప్రవేశ పెట్టడానికి ధైర్యం లేదు కానీ మంత్రుల మాటలు మాత్రం కోటలు దాటేశాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖలో పరిపాలనా రాజధాని అంటూ గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీ బయట ఎప్పుడో ప్రకటనలు గుప్పించేశారు. తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై మూడో రోజుకు చేరినా బిల్లు ప్రస్తావనే లేదు. కానీ మూడు రాజధానులే మా విధానమని ముఖ్యమంత్రి సహా మంత్రులు, వైసీపీ సభ్యులు సభలో ప్రసంగాలు ఘనంగా చేసేశారు. అసలు వాస్తవమేమిటంటే సాంకేతికంగా కానీ, న్యాయపరంగా కానీ మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు బిల్లు పెట్టారు.
ఓ సారి శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపినా ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకోకుండా మరోసారి బిల్లు పెట్టి ఆమోదించారు. గవర్నర్ ఆమోదించినా న్యాయపరమైన చిక్కులు రావడంతో చివరికి హైకోర్టులో బిల్లును ఉపసంహరించుకుంటామని ప్రకటించి వెనక్కు తీసుకున్నారు. అదే సమయంలో రాజధాని రైతులు వేసి పిటిషన్ విచారించిన హై కోర్టు ఆ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాజధాని అమరావతిని మార్చే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చేసిది. ఈ తీర్పు ప్రకారం అసెంబ్లీలో బిల్లు పెట్టడం కోర్టు తీర్పును ఉల్లంఘించడం అవుతుంది.
మొండికేసి జగన్ ముందడుగు వేస్తే ప్రభుత్వానికి చిక్కులు తప్పవని న్యాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నారు. ఇప్పటికే దాదాపు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ కోర్టు అక్షింతలు వేయించుకున్న జగన్ సర్కార్ మరో సారి అందుకు సిద్ధంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పలు సందర్భాలలో కోర్టు అధికారులను విస్పష్టంగా హెచ్చరించింది. ధిక్కరణకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొంది. ఐఏఎస్ లకు కోర్టు తీర్పు ఉల్లంఘించిన కారణంగా సామాజిక సేవ శిక్ష కూడా విధించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ మరో సారి కోర్టు ధిక్కరణకు పాల్పడి అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టే ధైర్యం చేయదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.