రైతుల పాదయాత్రలో వైసీపీ ఫ్లెక్సీల వివాదం
posted on Sep 17, 2022 @ 9:37AM
వివాదం లేకపోతే వైసీపీకి పూటగడవదన్నట్లుడగా తయారైంది పరిస్థితి. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. బాపట్ల జిల్లా రేపెల్లెలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానేలే ముద్దు అన్న నినాదంతో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమరావతి రైతులు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా వైసీపీ ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎక్కడా అమరావతి రైతుల ఆందోళనకు వ్యతిరేకత వ్యక్తం కాలేదు. రేపల్లెలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల లక్ష్యం రైతులు శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే అన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ ఫ్లెక్సీలకు ముందు ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు వైసీపీ మంత్రులు, నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వాతావరణాన్ని వేడెక్కించాయి.
ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసిన చందంగా రేపల్లెలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని రైతులు నిరసిస్తున్నారు. రేపల్లెలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు మిగిలిన ప్రాంతాలలో వైసీపీ శ్రేణులు కూడా ఇలాంటి చర్యలే చేపట్టేలా ప్రోత్సహిస్తాయని రైతులు అంటున్నారు. రైతులది పాదయాత్ర కాదు దండ యాత్ర అని మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు, ఇతర ప్రాంతాల ప్రజలు మీ దగ్గర పనివాళ్లుగా ఉండాలా అంటూ మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని చేసి వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అంతే కాకుండా సాక్షాత్తూ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా కూడా రైతుల పాదయాత్ర ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ కుట్ర పూరితంగా రైతల పాదయాత్రలో ఉద్రిక్తతలు సృష్టించి శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అమరావతి రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా జగన్ సర్కార్ వ్యవహరించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొట్టడమే లక్ష్యం వినా జగన్ సర్కార్ కు నిజంగా మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్లే అవకాశం ఇసుమంతైనా లేదని న్యాయరంగ నిపుణులు చెబుతున్నారు. వారి విశ్లేషణలకు తగినట్టుగానే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టే ధైర్యం లేక జగన్ వెనకడుగు వేశారని పరిశీలకులు అంటున్నారు. అందుకే అసెంబ్లీలో మూడు రాజధానుల విషయం స్వల్పకాలిక చర్చకే పరిమితం చేశారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానులపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ప్రసంగించారే తప్ప బిల్లు విషయంలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
చర్చ జరుగున్నప్పుడు కానీ, చర్చ ముగిసిన తరువాత కానీ ఉపసంహరించుకున్న మూడు రాజధానుల బిల్లును న్యాయపరమైన చిక్కులు లేకుండా మళ్లీ సభలో ప్రవేశపెడుతున్నామని మాట మాత్రంగానైనా చెప్పలేదు. వికేంద్రీకరణే విధానమని పదే పదే చెప్పిన సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు గురించి మాటమాత్రమైనా చెప్పలేదు. కానీ అసెంబ్లీ సమావేశాలకు ముందు మాత్రం వైసీపీ వర్గాలు ఈ సమావేశాలలోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమన్నట్లుగా ప్రచారం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదా సిద్ధంగా ఉందనీ, బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందడమే తరువాయి అనీ గట్టగా ప్రచారం చేసుకున్న వైసీపీ బిల్లు ప్రవేశపెట్టే విషయంలో వెనక్కు తగ్గింది. అడుగు గడప దాటలేదు కానీ మంత్రుల మాటలు మాత్రం కోటలు దాటేశాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖలో పరిపాలనా రాజధాని అంటూ గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీ బయట ఎప్పుడో ప్రకటనలు గుప్పించేశారు.
తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై మూడో రోజుకు చేరినా బిల్లు ప్రస్తావనే లేదు. కానీ మూడు రాజధానులే మా విధానమని ముఖ్యమంత్రి సహా మంత్రులు, వైసీపీ సభ్యులు సభలో ప్రసంగాలు ఘనంగా చేసేశారు. అసలు వాస్తవమేమిటంటే సాంకేతికంగా కానీ, న్యాయపరంగా కానీ మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు బిల్లు పెట్టారు. ఓ సారి శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపినా ఆ విషయాన్నిపట్టించుకోకుండా మరోసారి బిల్లు పెట్టి ఆమోదించారు. గవర్నర్ ఆమోదించినా న్యాయపరమైన చిక్కులు రావడంతో చివరికి హైకోర్టులో బిల్లును ఉపసంహరించుకుంటామని ప్రకటించి వెనక్కు తీసుకున్నారు. ఇక రాజధాని రైతులు వేసిన పిటిషన్ విచారించిన హై కోర్టు ఆ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాజధాని అమరావతిని మార్చే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చేసిది. ఈ తీర్పు ప్రకారం అసెంబ్లీలో బిల్లు పెట్టడం కోర్టు తీర్పును ఉల్లంఘించడం అవుతుంది. మొండికేసి జగన్ ముందడుగు వేస్తే ప్రభుత్వానికి చిక్కులు తప్పవని న్యాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నారు. ఇప్పటికే దాదాపు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ కోర్టు అక్షింతలు వేయించుకున్న జగన్ సర్కార్ మరో సారి అందుకు సిద్ధంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పలు సందర్భాలలో కోర్టు అధికారులను విస్పష్టంగా హెచ్చరించింది. ధిక్కరణకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొంది. ఐఏఎస్ లకు కోర్టు తీర్పు ఉల్లంఘించిన కారణంగా సామాజిక సేవ శిక్ష కూడా విధించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ మరో సారి కోర్టు ధిక్కరణకు పాల్పడి అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టే ధైర్యం చేయదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.