మద్యం అమ్మకాలతో 30 వేల కోట్ల అక్రమార్జన.. పవన్ ఆరోపణకు సమాధానం చెప్పు జగన్!
posted on Aug 12, 2023 @ 10:01AM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్యం అమ్మకాల్లో నేరుగా వైసీపీ అగ్ర నేతకే లాభం చేకూరుతోందంటూ చేసిన విమర్శలను ఖండించేందుకు ఆ పార్టీ నేతలెవరూ సాహసించని పరిస్థితిని చూస్తుంటే పవన్ వి కేవలం ఆరోపణలు మాత్రమే కాదన్న నిర్ధారణకు రావలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. మద్యం అమ్మకాలలో ప్రభుత్వ పెద్దలు అక్రమంగా 30 వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారంటూ జనసేనాని చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మద్యం అమ్మకాలలో డిజిటల్ ట్రాన్సాక్షన్ కు అవకాశం లేకుండా చేసి కేవలం నగదు చెల్లించే మద్యం కొనుగోలు చేయాలన్న షరతునకు వెనుక ఉన్న కారణం ఇదేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. విమర్శలకు తలొగ్గి డిజిటల్ చెల్లింపులకు కూడా ఓకే అని ప్రభుత్వం చెప్పినా.. వాస్తవంగా మాత్రం ఏపీలోని మద్యం దుకాణాలలో కనీస శాతంలో కూడా నగదు లావాదేవీలకు అవకాశం లేని పరిస్థితే ఉంది. అక్రమంగా సొమ్ములు వెనకేసుకోవడానికే మద్యం అమ్మకాలలో నగదు చెల్లింపులను మాత్రమే అనుమతిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు లెక్కలతో సహా పవన్ కల్యాణ్ మద్యంలో వైసీపీ పెద్దల అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో చెప్పడంతో..
జనం విస్తుపోతున్నారు. నల్ల ధనాన్ని వెలికి తీయడమే లక్ష్యం అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ.. ఆ దారిలో ఎన్ని అడగులు వేశారో కచ్చితంగా చెప్పలేం కానీ, నల్ల ధనాన్ని అరికట్టడానికి అంటూ ఆయన పెద్ద నోట్లను రద్దు చేశారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే పారదర్శకత ఉంటుందని దానిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా దాదాపుగా లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరిగే పరిస్థితి వచ్చింది. ఏపీలో అదీ ఒక్క మద్యం అమ్మకాల విషయంలో మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒక అంటరాని వ్యవహారంగా పరిగణింపబడుతోంది. ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని పక్కదారి పట్టించడానికే నగదు లావాదేవీలు మాత్రమే అంటూ మద్యం విధానాన్ని జగన్ అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లధనంపై ఉక్కు పాదం అంటూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రసంగాలు చేస్తూ.. తన హయాంలో అక్రమార్జనకు తావులేకుండా పోయిందని ఘనంగా చెప్పుకునే ప్రధాని మోడీ.. ఏపీలో మద్యం అమ్మకాలలో జరుగుతున్న అడ్డగోలు అక్రమాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.
అయితే ఇక్కడ పవన్ మాత్రం కేంద్రంలోని మోడీ సర్కార్ ను ప్రశ్నించడం లేదు... ఆయన ద్వంద్వ ప్రమాణాలను వేలెత్తి చూపడం లేదు. పైపైచ్చు ఆయన సహకారంతోనే అంటే కేంద్రం సహకారంతోనే జగన్ ఆటకట్టిస్తానంటున్నారు. సరే అది పక్కన పెడితే.. మద్యం విధానం కారణంగా ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టడం లేదనీ, ఒక్క రూపాయి కూడా అక్రమార్జనకు అవకాశం లేదనీ వైసీపీ గట్టిగా చెప్పలేకపోతోంది. అలా చెబితే నగదు లావాదేవీలను ఎందుకు అంగీకరించడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు కనుకనే పవన్ అయినా, మరెవరైనా సరే ప్రభుత్వ అవినీతిపై విమర్శలు గుప్పించినా, ప్రశ్నించినా లైట్ తీసుకుని వదిలేస్తోంది. ఇక జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో కొత్త పరిశ్రమలు రావడం మాట అటుంచి.. ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయనీ, జగన్ విధానాల కారణంగా రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం లేకపోగా.. పొరుగు రాష్ట్రాలు బ్రహ్మాండంగా లబ్ధి పొందుతున్నాయనీ సోదాహరణంగా వివరిస్తున్నారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో పని చేస్తున్న పరిశ్రమలు కూడా విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శనమంటూ అమరరాజా బ్యాటరీ పరిశ్రమను ఉదహరిస్తున్నారు. లూలూ పరిశ్రమ ఏపీలో వ్యాపారం చేయలేమంటూ పారిపోవడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.