హవ్వ.. జగన్ బలం ఇదా? గాలి తీసేసిన సజ్జల భార్గవ్!
posted on Jan 9, 2024 4:21AM
జగన్ మోహన్ రెడ్డి పాలనపై మీడియా విమర్శలు చేస్తే.. అలా విమర్శించే మీడియాను వైసీపీ నేతలు ఎల్లో మీడియాగా వక్రీకరిస్తారు. ప్రజలు తమ ఆవేదనను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో వినిపించినా అలా వినిపించే వారంతా పెయిడ్ ఆర్టిస్టులని ముద్ర వేస్తారు. ఇక ప్రతిపక్షాలు ఏకమైనా జగన్ మోహన్ రెడ్డిని ఏం చేయలేరని వైసీపీ బ్యాచ్ సెలవిస్తుంటుంది. ప్రజల అండ జగన్ మోహన్ రెడ్డికి పుష్కలంగా ఉందని.. ప్రజల ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి ఉండగా ఎవరూ ఏమీ చేయలేరని ప్రకటనలు కుమ్మేస్తుంటారు. అయితే, ఇదంతా నిజమా.. ఏపీ ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డిపై అంత మంచి అభిప్రాయంతో ఉన్నారా అంటే అది ఎంత మాత్రం నిజం కాదు. జగన్ సభల నుంచి పారిపోతున్న జనమే అందుకు నిదర్శనం. అన్ని వర్గాల ప్రజల నుంచీ వస్తున్న వ్యతిరేకతే తార్కాణం. అయితే మరి వైసీపీ ధైర్యం ఏమిటి? అందరూ, అన్ని వర్గాలూ దూరమౌతున్నా.. మా ఓటర్లు వేరు. మా బలం వేరు అంటూ ధీమాగా ఎలా చెప్పుకుంటోంది.
ఒక వైపు జనం మా నమ్మకం నువ్వు కాదు జగన్ అని ముఖం మీద చెప్పేస్తున్నా మా ఓటర్లు మీరు కాదు, మా బలం మీరు కాదు అని వైసీపీ చెప్పుకుంటోంది. వైసీపీ ఓటర్లు వేరు అంటే ఏమిటో ఇప్పటికే అర్ధమైపోయింది. పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపుతో ఎన్నికల గండం గట్టెక్కేయగలమన్న ధైర్యంతోనే ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరు అని ధైర్యంగా చెప్పగలిగారు. అయితే తెలుగుదేశం అలర్ట్ గా ఉండి ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంతో ఆ పప్పులు ఉడికే పరిస్థితి లేకపోయింది.
ఇక ఇప్పుడు అదే సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు, వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జ్ అయిన సజ్జల భార్గవరెడ్డి వైసీపీ బలం ఏమిటో, ఎవరో చెప్పేశారు. జగన్ జనాలను నమ్ముకోలేదనీ, ఆయన బలం, బలగం వేరే అని స్వయంగా వెల్లడించారు. తమ పార్టీ నమ్మకున్నది ప్రజా బలాన్ని కాదనీ, గొబెల్స్ ప్రచారాన్ని మాత్రమేననీ కుండబద్దలు కొట్టేశారు.
ఉన్నది లేనట్లుగా.. అబద్దాన్ని కూడా నిజమే అనిపించేలా నమ్మించగలిగే సోషల్ మీడియాయే తమ బలం అని దాపరికం లేకుండా చెప్పేశారు. సోషల్ మీడియా ద్వారా జగన్ లాంటి నాయకుడు ఇక దొరకరని, అసలు జగన్ మోహన్ రెడ్డి లాంటి నేత దొరకడం ఏపీ ప్రజల అదృష్టమని ప్రజలను నమ్మించగలమనీ, అదే తమ బలం అని సజ్జల భార్గవరెడ్డి ఉవాచ. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా విస్తృతమైన సంగతి తెలిసిందే. అయితే, ఏదైనా ఒక విషయాన్ని పదేపదే చూసినా.. పదేపదే చదివినా ప్రజలు నమ్మేస్తారని.. ఎక్కువసార్లు చర్చ జరిగిన అంశం పట్ల ప్రజలలో సానుకూలత పెరుగుతుందని చెప్పిన సజ్జల భార్గవరెడ్డి, వైసీపీ ఇప్పుడు 15 వెబ్ సైట్స్, 40 యూట్యూబ్ చానెల్స్, 200 ఇంస్టాగ్రామ్ పేజెస్ ని పోషిస్తున్నదని వెల్లడించారు. వీటి ద్వారా జగన్ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ఎన్నడూలేని విధంగా జగన్ పరిపాలన సాగిందని, మరోసారి ప్రజలంతా జగన్ కు అండగా ఉండాలని, మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని భజన చేసి ప్రజలను నమ్మించేస్తామనీ, నమ్మించేయగలమనీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి భార్గవ్ చెప్పిన సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ సంఖ్య చాలా తక్కువని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది కాలంగా వైసీపీ వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానెల్స్ ను కొనేసింది. వందల సంఖ్యలో సోషల్ మీడియా ఖాతాలను సొంతం చేసుకుంది. వీటి కోసం వందల కోట్లు ఖర్చు చేసింది. కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయగల సోషల్ మీడియా సెలబ్రిటీలు, వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ నడిపే వారికి కూడా వైసీపీ భారీ స్థాయిలో డబ్బు ఆశ జూపి గాలమేసి లాగేసింది. వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ వీటిని కొనేసి వాటి ద్వారా టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేసింది. మరో వైపు ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల యాడ్స్ వచ్చేలా ప్రకటనలు కుమ్మేస్తున్నది. వందల కోట్లు ఖర్చు చేసి సాక్షాత్తు యూట్యూబ్ లాంటి సంస్థలతోనే ఒప్పందాలు చేసుకొని ఈ ప్రకటనలు ఇస్తున్నది.
దీనిని బట్టి చూస్తే రానున్న ఎన్నికల కోసం వైసీపీ ఈ డిజిటల్ ప్రచారంపైనే ఆధారపడిందని, దానినే నమ్ముకున్నదని స్పష్టంగా అర్ధమవుతున్నది. ఏపీ ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఏ సర్వే ఫలితాలు చూసినా జగన్ పార్టీకి ఘోర ఓటమి తప్పదని తేల్చి చెప్పేస్తున్నాయి. తమ పాలనపై తమకే కాదు, జనానికీ నమ్మకం లేదని తేలిపోవడంతో.. వైసీపీ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ ప్రచారాన్ని నమ్ముకున్నట్లు తెలిసిపోతున్నది. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇన్ చార్జ్ సజ్జల భార్గవ్ ఇదే విషయాన్ని ఓ పార్టీ కార్యక్రమంలో వెల్లడించారు. తమకు ఇన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఇంత బలం ఉందంటూ సజ్జల చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు అదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తండ్రి సజ్జల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సమయంలో తమ ఓటర్లు వేరే ఉన్నారంటూ వ్యాఖ్యలు చేయగా.. కుమారుడు సజ్జల తమ బలం వేరే ఉందంటూ వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.