కేశినేని శ్వేత రాజీనామా.. కుమార్తె రాజకీయ జీవితాన్ని నాశనం చేయొద్దంటూ నానికి హితవు!
posted on Jan 9, 2024 2:59AM
గత వారం రోజులుగా తెలుగుదేశం బెజవాడ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నానీకి ఈసారి టికెట్ లేదని టీడీపీ అధిష్ఠానం తేల్చేయడంతో పాటు ఇకపై నియోజకవర్గ రాజకీయాల్లో కూడా ఎక్కువ జోక్యం చేసుకోవద్దని సూచించింది. దీంతో ఆయన పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటనకు కూడా చేయగా.. లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్ దొరికితే ఢిల్లీ వెళ్లి తన రాజీనామా సమర్పించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకూ నానీ రాజీనామా చేయనున్నట్లు, తెలుగుదేశం పార్టీని వీడనున్నట్లు ప్రకటించారే కానీ ఆ పని ఇంకా చేయలేదు. కానీ, కేశినేని నాని కుమార్తె శ్వేత మాత్రం తండ్రి కంటే ముందే ఆ పని చేశారు. శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. మేయర్ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖ సమర్పించారు. అక్కడ అమోదం పొందిన తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. యధావిధిగా తండ్రి బాటలోనే కుమార్తె కూడా రాజీనామా అనంతరం తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
అయితే, నానీ రాజీనామా వార్తపై పెద్దగా తెలుగు దేశం శ్రేణులు స్పందించలేదు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా నానీ పనిచేస్తున్నారని, ఎంపీగా పార్లమెంట్ పరిధిలోని, ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీలకు సహకరించడం లేదని చాలాకాలంగా ఆయనపై విమర్శలు ఉన్నాయి. ఆ కారణంతోనే నానీతో తెలుగుదేశం అధిష్టానంకు సఖ్యత కొరవడిందని కూడా తెలుగుదేశం వర్గాలే బహిరంగంగా చెప్పాయి. ఈ కారణంగానే తెలుగుదేశం అధిష్టానం ఈసారి కేశినేని నానీ స్థానంలో ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. నిజానికి ఈ స్థానంపై తెలుగుదేశం ఎన్నో కసరత్తులు చేసింది. పలుమార్లు నానీని హెచ్చరించింది. అయితే నానీ మాత్రం బహిరంగంగానే తన అహంకార ధోరణిని చూపించారు. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే తెలుగుదేశంలో ఉండి కూడా నానీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. పర్యవసానంగా పార్టీ అతన్ని పక్కకి పెట్టి తమ్ముడిని లైన్లో పెట్టింది. దీంతో నానీ ఇప్పుడు పార్టీని వీడివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తెలుగు దేశం శ్రేణులు కూడా నానీ రాజీనామాను లైట్ తీసుకున్నాయి.
కానీ, నానీ కుమార్తె శ్వేత రాజీనామాపై మాత్రం తెలుగుదేశం శ్రేణులు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. శ్వేతా రాజీనామా ప్రకటన చేసిన సోషల్ మీడియాలోనే కుమార్తె విషయంలో నాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. ఇంత తెలిసిన నానీ తన కుమార్తె రాజకీయ జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారని నెటిజన్లు, టీడీపీ సానుభూతిపరులు విరుచుకుపడుతున్నారు. బోలెడంత భవిష్యత్తు ఉన్న శ్వేత రాజకీయ జీవితాన్ని నానీ చేజేతులా చెడగొట్టేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. బెజవాడ రాజకీయాలలో చురుకైన యువనేతగా ఉన్న శ్వేత తెలుగుదేశంలో ఉంటే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని.. కానీ నానీ తన పంతం, పట్టుదల, అహంకారంతో ఆమె రాజకీయ జీవితాన్ని ఫణంగా పెడుతున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. నానీ తన పొలిటికల్ కెరీర్ ను తానే నాశనం చేసుకొని.. ఇప్పుడు తన కుమార్తె కెరీర్ ను కూడా తానే పక్కన ఉండి నాశనం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి నానీ ఈ స్థాయికి చేరుకోవడం వెనక చాలా శ్రమ ఉంది. ఒకప్పుడు విజయవాడ ఆటో నగర్ లో తన జీవితాన్ని ప్రారంభించిన నానీ.. ట్రావెల్స్ లో ఒక బ్రాండ్ సృష్టించుకొని అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాలలోకి వచ్చారు. తెలుగు దేశం పార్టీలో చేరి పదేళ్లు ఎంపీగా పనిచేశారు. అధికారంలో ఐదేళ్లు, ప్రతిపక్షంలో ఐదేళ్లు పనిచేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి గుర్తింపు కూడా దక్కించుకున్నారు. అయితే, ఇప్పుడు ఉన్నట్లుండి ఆయన రాజకీయ జీవితం అగాధంలో పడింది. దీనికి నాని స్వయంకృతాపరాధమే అని చెప్పక తప్పదు. ఇంత జర్నీలో నానీ ఎంతో శ్రమ పడి ఈ స్థాయికి చేరుకున్నా.. కేవలం ఒకే ఒక్క తప్పుతో శూన్యంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. తనతో పాటు తన కుమార్తెను కూడా జీరో స్థాయికి దిగజారేలా తోడు తీసుకెళ్లడం బాధాకరంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి నానీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో.. కుమార్తె రాజకీయ ప్రయాణం కోసం నానీ ఏమైనా కొత్త మార్గాలు అన్వేషిస్తారా అన్నది చూడాల్సి ఉంది.