ఎన్నికల బరిలో నితిన్ వర్సెస్ దిల్ రాజు
posted on Aug 2, 2023 @ 2:26PM
రానున్న సార్వత్రిక ఎన్నికలు చాలా రసవత్తరంగా జరగనున్నాయనే ఓ చర్చ అయితే అటు పోలిటికల్ సర్కిల్‌లో ఇటు టాలీవుడ్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల బరిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ హీరో నితిన్ ఒకరిపై ఒకరు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయనే ఓ చర్చ సైతం ఊపందుకొంది.
నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర పంపిణి విషయంలో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి, నిర్మాత దిల్ రాజు మధ్య వివాదం నెలకొనడంతో వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు ఓ చర్చ అయితే టాలీవుడ్ వర్గాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు సై అంటే సై అనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
అదీకాక దిల్ రాజు, హీరో నితిన్ ఇద్దరిది నిజామాబాద్ జిల్లానే కావడం గమనార్హం. ఇక హీరో నితిన్ మేనమామ, పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు తన వంతుగా సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి నితిన్‌ని బరిలోకి దిగేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారనే చర్చ కొనసాగుతోంది. అయితే సదరు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మధుయాష్కి పోటీ చేయని పక్షంలో నితిన్‌ను హస్తం పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా అధిష్టానం చేత ఖరారు చేయించే పనిలో నగేష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంకోపైపు హీరో నితిన్.. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడంతో.. ఆయన రాజకీయ ఎంట్రీపై ఓ రేంజ్‌లో పుకార్లు సైతం షికారు చేస్తున్నాయి. కానీ నితిన్‌ను మాత్రం కాంగ్రెస్ నుంచే బరిలో దింపేందుకు నగేష్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది.
ఇక నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దిల్ రాజు బరిలో నిలిపే అవకాశం ఉందనే చర్చ సైతం సాగుతోంది. 2019 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కవిత.. బీజేపీ అభ్యర్థి దర్మపూరి అర్వింద్ చేతిలో ఓటమి పాలైయ్యారు. కానీ రానున్న ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆ క్రమంలో నిజామాబాద్ ఎంపీగా దిల్ రాజు బరిలో దిగనున్నారనే ప్రచారం సైతం వాడి వేడిగా కొన..సాగుతోంది.
ఇంకోవైపు తాను రాజకీయాల్లోకి వెళ్లితే ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో ఎక్కడి నుంచి అయినా గెలుస్తానంటూ దిల్ రాజ్ వ్యాఖ్యానించారు. ఆ కొద్దిరోజులకే ఆయన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి దిల్ రాజు, నితిన్‌లు ఎన్నికల బరిలోకి దిగితే.. ఎవరు గెలుస్తారనేది మాత్రం సస్పెన్సే. ఎందుకంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అలాంటి వేళ.. ఓ వేళ వీరిద్దరి.. ఎన్నికల బరిలో నిలిస్తే.. ఎవరు గెలుస్తారంటే మాత్రం ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే అనే చర్చ సైతం పోలిటికల్, టాలీవుడ్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.