బల పరీక్షలో గెలిచిన నితీష్
posted on Aug 25, 2022 @ 11:28AM
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీ విశ్వాసాన్ని చూరగొన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆర్జేడీ తదితర పార్టీల మద్దతుతో మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మొదటి అసెంబ్లీ సమావేశం బుధవారం జరిగింది. ఆ సమావేశంలో నితీష్ కుమార్ సభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. అయితే బల పరీక్సకు ముందు నితీష్ మాట్లాడుతూ రెండేళ్ల కిందట బీజేపీ కన్నా చాలా తక్కువ స్థానాలు వచ్చిన జేడీయూకే సీఎం పదవి దక్కడానికి గల కారణాలను వివరించారు. 2020 ఎన్నికల అనంతరం బీజేపీ తనపై తీవ్ర ఒత్తడి తీసుకువచ్చి తాను సీఎం పదవిని చేపట్టేలా ఒప్పించిందని వెల్లడించారు. బీజేపీ కంటే తక్కువ స్థానాలు వచ్చిన జేడీయూ నుంచి తనకు సీఎం పదవి వస్తుందని తానసలు ఊహించలేదనీ, బీజేపీ నుంచి రేసులో ఉన్న ఉన్న సుశీల్ కుమార్ మోడీయే బీహార్ సీఎంగా బాధ్యతలు చేపడతారని తాను భావించినట్లు చెప్పారు. అయితే బీజేపీ తనపై ఒత్తిడి తీసుకు వచ్చి సీఎం పదవి చేపట్టేలా ఒప్పించిందని వివరించారు. అయితే ఆ మరుక్షణం నుంచీ అన్ని వైపుల నుంచీ తన కాళ్లూ చేతులూ కట్టేయడానికే ప్రయత్నించిందని నితీష్ ఇప్పుడు ఆరోపించారు.
స్పీకర్ విషయంలో కూడా అప్పట్లో తన మాట నెగ్గలేదని వివరించారు. అలా రెండేళ్ల పాటు ఒత్తిడుల మధ్య సీఎంగా కొనసాగిన తాను చివరకు ఆ బంధాన్ని తెంచుకున్నానని వివరించారు. తాజాగా మహాఘట్ బంధన్ ప్రభుత్వం కొలువుదీరి, సభలో బల పరీక్ష ఎదుర్కొంటున్న సమయంలో మహాఘట్ బంధన్ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు నిర్వహించడం ఎంతమాత్రం యాధృచ్ఛికం కాదని సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసులో భాగంగా సీబీఐ బీహార్ లో దాడులు నిర్వహించింది.
2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో జరిగిన రిక్రూట్‌మెంట్లలో పలువురు అభ్యర్థులకు గ్రూప్ డీ ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ భూములను లంచంగా తీసుకున్నారని అభియోగాలు ఉన్న సంగతి విదితమే.
ఆ కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం ఆర్జేడీ ఎంపీ అహ్మద్ కరీం, ఎమ్మెల్సీ సునీల్ సింగ్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్ళలో సోదా నిర్వహించింది. అయితే ఈ దాడుల వెనుక ఉన్నది రాజకీయ కారణమేనని నితీష్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే లక్ష్యంతోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. ఇటువంటి దాడులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు.