కాంగ్రెస్ కొత్త సారథి ఎవరు? రాహుల్ అభీష్టం మేరకే గాంధీ కుటుంబం బయటి వ్యక్తికే పగ్గాలు?
posted on Aug 25, 2022 @ 11:06AM
కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి కొత్త అధ్యక్షుడు కచ్చితంగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తినే ఎన్నుకోవడం దాదాపు ఖాయమైపోయిందా అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. సోనియాగాంధీ ఆరోగ్య సమస్యలతో పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి సుముఖంగా లేని సంగతి విదితమే. ఇక రాహుల్ గాంధీ అయితే తాను పట్టిన పట్టు విడవబోనని ఖరాఖండీగా తేల్చేశారు.
తాను పార్టీ పగ్గాలు చేబట్టబోననీ విస్పష్టంగా తెలియజేయడంతో పార్టీ ప్రియాంక గాంధీవైపు మొగ్గు చూపినా ఆమె కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించారని చెబుతున్నారు. దీంతో అనివార్యంగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఎదురైంది. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న చర్చ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపట్టినా వారు గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడే అయి ఉండాలన్నది బయటకు చెప్పని కండీషన్ గా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
పార్టీలో పాత తరం, కొత్తతరం నేతలను కలుపుకుపోగలిగిన వ్యక్తి... అదే సమయంలో గాంధీ కుటుంబానికి ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభమైందని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ప్రముఖంగా అశోక్ గెహ్లాట్, అంబికాసోని, మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, కేసీవేణుగోపాల్, మీరాకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రస్తుత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గు చూపుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నారు. అశోక్ గెహ్లాట్ ను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే రాజస్థాన్ సీఎంగా రాహుల్ గాంధీకి సన్నిహితుడైనా రాజేష్ పైలట్ కు అవకాశం దక్కుతుందని, ఇది ఉభయతారకంగా ఉంటుందనీ ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే సోనియాగాంధీ ఈ విషయమై అశోక్ గెహ్లాట్ ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్లు చెబుతున్నారు. వయోభారం కారణంగా ఆయన కూడా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేరని, ఇదే విషయాన్ని ఆయన సోనియాకు చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కానీ అసలు విషయమేమిటంటే.. తాను రాజస్థాన్ ను వదిలి వస్తే పైలట్ రాష్ట్ర సీఎం పగ్గాలు చేపడతారనీ, అదే జరిగితే రాష్ట్రంలో తన పట్టు సన్నగిల్లుతుందనీ ఆయన భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా అశోక్ గెహ్లాట్ కనుక పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఇష్టపడకపోతే రేసులో అంబికా సోనీ మల్లికార్జున్ ఖర్గే మీరాకుమార్ కేసీ వేణుగోపాల్ ముకుల్ వాస్నిక్ లలో ఎవరో ఒకరికి ఆ పదవి దక్కే అవకాశం ఉందని పరిశీలకలు అంటున్నారు. వారందరూ కూడా గాంధీ కుటుంబానికి విధేయులేనన్న విషయం తెలిసిందే.
ఏది ఏమైనా ఈ నెల 28న జరగనున్న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నికల తేదీని ఖరారు చేయడమే కాకుండా.. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంలో కూడా పార్టీ కేడర్ కు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సీడబ్ల్యుసీ భేటీలో అధ్యక్ష ఎన్నిక తేదీని ప్రకటించడమే కాకుండా.. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న క్లారిటీని కూడా క్యాడర్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గాంధీ కుటుంబీకులు కాకుండా మరెవరైనా సరే కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి పార్టీని నడపడం అంటే వారికి కచ్చితంగా కత్తిమీద సాము వంటిదే. ఆ పదవిలో ఉండి స్వతంత్రంగా వ్యవహరించడం అంత సులువు కాదు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా సొంత నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ నరసింహరావుకు.. ఆ తరువాత పార్టీలో జరిగిన మర్యాద ‘తెలిసిందే’ అలాగే సీతారాం కేసరి కూడా. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు పార్టీలో ఎవరూ కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. అందరూ ముక్త కంఠంతో రాహుల్ గాంధీయే మా నాయకుడు అంటూ చివరి క్షణం వరకూ ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టేలా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు.