స్పీడ్ న్యూస్- 1
posted on Jul 4, 2023 @ 11:58AM
1. ల్యాండ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, మాజీ ముఖ్యమంత్రులు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు అయ్యింది. ఈ నేపథ్యంలో తేజస్వీని వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ యాదవ్ డిమాండ్ చేశారు.
2.ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో బుధవారం భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో చర్చిస్తారు. అలాగే రాజకీయ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
3. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. ఖలిస్థాన్ మద్దతుదారులు కార్యాలయానికి నిప్పు పెట్టారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఐదు నెలల్లో ఇది రెండోసారి. మార్చిలో ఒకసారి ఖలిస్థాన్ మద్దతుదారులు రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
4. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
5. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ బోగస్ ఓట్లపై తెలుగుదేశం అప్రమత్తమైంది. అలాగే అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలపైనా దృష్టి సారించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎనిమిది మందితో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.
6.రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో మంగళవారం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళలపైకి వేగంగా వచ్చిన హోండా స్పోర్ట్స్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఒక చిన్నారి మరణించింది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి అతివేగమే కారణమంటున్నారు.
7. కరీంనగర్ జిల్లాలో నిన్న అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
8. ఉత్తరప్రదేశ్ నిన్న రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యారు. యూపీలో ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలోని ఎలక్ట్రానిక్, స్పోర్ట్సు స్టోరులో ఈ ఘోరం జరిగింది. అగ్నిప్రమాదానికి కారణాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
9.తమిళనాడు సీఎం స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయన చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. స్టాలిన్ జీర్ణకోశ సంబంధిత సమస్యతో స్టాలిన్ ఇబ్బంది పడుతున్నారు.
10. రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్న గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కేంద్రప్రభుత్వం కట్టడి చేయకుంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు. డీఎంకే సర్కార్ పట్ల ప్రజాభిమానం సహించలేకే గవర్నర్ అలా చేస్తున్నారన్నారు.