పని మొదలెట్టేసిన కొత్త పార్టీ!
posted on Aug 2, 2023 @ 3:29PM
కొత్త పార్టీ అప్పుడే పని ప్రారంభించేసింది. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఏపీలో జగన్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్పడిన 35 వేల కోట్ల రూపాయల అవినీతిపై అమిత్ షాకు ఆధారాలను అందజేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులున్నాయి. 17 మంది డైరెక్టర్ల ద్వారా సూట్కేసు కంపెనీలు సృష్టించి అవినీతిని దాచే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ముందు పెద్దిరెడ్డికి ఉన్న ఆస్తుల వివరాలను దాచిపెట్టారని రామచంద్రయాదవ్ హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.
పెద్ది రెడ్డి అక్రమాలు, అవినీతిపై ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. అలాగే ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మోసం చేశారని, దానిపై న్యాయపోరాటానికి సమాయత్తమౌతున్నానని అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో రామచంద్రయాదవ్ చెప్పారు. అలాగే పెద్దరెడ్డి తప్పుడు అఫిడవిట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. కాగా తన భారత చైతన్య యువజన పార్టీ వెనుక బీజేపీ ఉన్నదంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని, బీజేపీ కోసం పని చేసేవాడినైతే తానే బీజేపీలో చేరేవాడిని కదా అని కూడా అన్నారు. జగన్ అక్రమాలను ఎదుర్కొనే విషయంలో ఏపీలో ఇప్పుడున్న పార్టీల వల్ల ఉపయోగం లేదన్న నిర్ణయానికి వచ్చిన మీదటే సొంతంగా పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
మొత్తంగా మంగళవారం ( ఆగస్టు 2)న రామచంద్రయాదవ్ అమిత్ షాతో దాదాపు 20 నిముషాలు భేటీ అయ్యారు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలు హోమంత్రికి అందజేసిన ఆయనఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని విమర్శించారు. 2019 నుంచి ఇప్పటి వరకూ జగన్ సర్కార్ చేస్తున్నది కేవలం రాష్ట్ర సంపద లూటీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న విపక్షాల నాయకులపై కేసులు బనాయించడం వేధించడమ మాత్రమేనని రామచంద్రయాదవ్ అన్నారు. పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఇసుకాసురులనీ, ఒక్క ఇసుక అనేమిటి, అన్ని రంగాలలోనూ దోపిడీకి పాల్పడుతున్నారని రామచంద్రయాదవ్ ఆరోపించారు. అవినీతి సొమ్ముతో వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు.
అంతే కాకుండా పీఎల్‌ఆర్ కంపెనీకి ప్రభుత్వం నుంచి అక్రమంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులున్నాయని రామచంద్రయాదవ్ ఆరోపించారు. జగన్ సర్కార్ కేబినెట్ లో ఒక్క మంత్రిపైనే రూ.35 వేల కోట్లు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయంటూ.. మొత్తం కేబినెట్ లో మిగిలిన మంత్రుల అవినీతి లెక్క ఎంత ఉంటుందో ఊహాతీతమేమీ కాదని పరిశీలకులు ఒక్కో మంత్రిపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ విశ్లేషిస్తున్నారు. సీఎం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర సంపదని లూటీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అవినీతి సర్కార్ పై రాజీలేని పోరాటం చేయడానికే కొత్త పార్టీని ఏర్పాటు చేశామన్న రామచంద్రయాదవ్ రానున్న రోజులలో తమ పోరాట కార్యచరణ ప్రారంభించనున్నామని అన్నారు.