కేసీఆర్ రీతి, నీతి.. నిన్నటికి నేడు కొత్త.. నేటికి రేపు కొత్త
posted on Aug 2, 2023 @ 4:01PM
కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. నిన్న రైట్ అన్నది రేపు రాంగ్ అవుతుంది.. ఇవ్వాల రాంగ్ అన్నది రేపు రైట్ అవుతుంది అని. అయితే తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం ఎప్పుడు ఏది రైట్ అంటారో.. ఎప్పుడు ఏది రాంగ్ అంటారో ఆయనకైనా తెలుసా అన్న అనుమానం కలగక మానదు. ఒకే విషయంపై వేర్వేరు సందర్భాలలో ఆయన వేర్వేరు భాష్యాలు చెబుతారు. జనానికి ఏదీ గుర్తు ఉండదన్న విశ్వాసమో.. లేక ఆయనకే ఏం మాట్లాడానన్నది గుర్తుండదా అన్నది తెరాస శ్రేణులకే అర్ధం కాని విషయం. తెలంగాణ ఆవిర్భావానికి ముందు దళిత ముఖ్యమంత్రి అన్న ఆయనే.. తీరా తెలంగాణ ఆవిర్భవించి.. తెరాస (ఇప్పుడు బీఆర్ఎస్) విజయం సాధించిన తరువాత మాట మార్చారు. కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే సమర్ధుడి నాయకత్వం అవసరమంటూ తానే సీఎం పగ్గాలు అందుకున్నారు. అలా అందుకున్న తరువాత గత తొమ్మిదేళ్లుగా ఆయనే అధికార పగ్గాలను చేతబట్టారు. దళిత ముఖ్యమంత్రి అని తన నోటి వెంటే వచ్చిన మాటను పూర్తిగా మరిచిపోయారు. తన తరువాత రాష్ట్ర పగ్గాలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి అప్పగించడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు. ఇక ఆ తరువాత ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి అన్నది కూడా అలాగే అయ్యింది. మచ్చుకు ఇవి రెండు మాత్రమే ప్రస్తావించినా.. ఆయన ఔనన్నది కాదని.. కాదన్నది ఔనన్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం. ఇది నిజంగా ఉభయ తెలుగు రాష్ట్రాలనూ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ నిన్న మొన్నటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది. అయితే ఏపీలో జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత తెలంగాణలో కూడా అలాగే చేయాలన్న డిమాండ్ బలంగా తెరపైకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ దానిని కొట్టి పారేశారు. ఆంధ్రలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ చేసిన ప్రయోగం విఫలమౌతుందని అప్పట్లో జోస్యం చెప్పారు. బుర్రా బుద్ధీ ఉన్నవారెవరూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయరనీ, అది జరిగే పని కాదనీ తేల్చేశారు. ఆ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పేరు ప్రస్తావించి మరీ అది సరైనది కాదని చెప్పారు. తెలివితక్కువ నిర్ణయం అని తేల్చేశారు. అయితే ఇప్పుడు ఎవరూ అడగకుండానే స్వయంగా కేసీఆర్ ఆ తెలివి తక్కువ నిర్ణయం తీసుకుని, తాను తీసుకున్న నిర్ణయం చాలా చాలా గొప్పదంటూ తన భుజాలను తానే చరుచుకుంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమన్నది భూగోళం ఉన్నంత వరకూ జరిగేది కాదన్న నోటితోనే ఆయన విలీన ప్రకటన చేశారు. విధివిధానాల ఖరారుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేబినెట్ లో ఆర్టీసీ విలీనం నిర్ణయం తరువాత నాడు ఏపీలో ఆర్టీసీ విలీనం తరువాత కేసీఆర్ మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలివితక్కువ నిర్ణయాలను అడాప్ట్ చేసుకోవడంలో కేసీఆర్ అంతటివాడు లేడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పదన్న విశ్లేషణల నేపథ్యంలో కేసీఆర్ వీఆర్ఏలకు, ఆర్టీసీ కార్మికులకు వరాలు కురిపించడం చాణక్యమేనని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలి ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ అని వాగ్దానం చేసిన ఆయన ఇన్నేళ్లుగా మొండి చేయి చూపుతూనే వస్తున్నారు. మాట ఇవ్వడం.. మాట తప్పడం, హామీలను గాలికి వదిలేయడం కేసీఆర్ కు కొత్తేమీ కాదని అంటున్నారు. ఎన్నికలు ముంచుకువస్తున్నాయి కనుక విలీనం అంటూ చేసిన ప్రకటన ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందన్న భావనతోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారనీ, అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల బకాయిలు, ఇతర ఆర్థిక అంశాల గురించి కేబినెట్ లో కనీస ప్రస్తావన కూడా చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్పటికెయ్యది
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.
అన్న సుమతీ శతకంలోని శ్లోకాన్ని కేసీఆర్ తు.చ. తప్పకుండా పాటిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.