శవాన్ని ఇంట్లో దాచిపెట్టి పెళ్లి!
posted on Feb 8, 2016 @ 10:16AM
నవీన్, ఆర్జూ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి నవీన్ ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. పెద్దలకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇబ్బంది పడటం ఇష్టం లేని ఆ జంట ఇక ఎప్పటికీ కలవకూడదని నిర్ణయించుకుంది. ఇంతదాకా బాగానే ఉంది. కానీ నవీన్‌కి వేరొకరికతో వివాహం నిశ్చయం కావడంతో సమస్యలు మొదలయ్యాయి. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని ఆర్జూ పట్టుపట్టింది. తన పెళ్లి గురించి ఆర్జూని ఒప్పించడమో, ఆమె పెద్దలని హెచ్చరించడమో చేస్తే సరిపోయేదానికి వేరే నిర్ణయాన్ని తీసుకున్నాడు నవీన్. దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆర్జూని గతవారం బయటకి తీసుకువచ్చాడు. మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లాడు. నవీన్ తనను పెళ్లి చేసకునే ఉద్దేశ్యంతోనే ఉన్నాడన్న సంతోషంలో ఉన్న ఆర్జూని... సజీవ దహనం చేశాడు! ఆమె శవాన్ని తన ఇంట్లోనే దాచిపెట్టి, ఏమీ ఎరగనట్లు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. రోజులు గడిచినా ఆర్జూ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు. వెతుకులాటలో భాగంగా నవీన్ ఇంటిని చేరుకున్న పోలీసులకి అక్కడ ఆర్జూ శవం కనిపించింది. ఈ సంఘటన ఇటు ఆర్జూ ఇంట్లోనే కాదు, అటు కొత్త పెళ్లికూతురు ఇంట్లోనూ విషాదాన్ని నింపింది!