ముద్రగడ దీక్ష విరమణ...
posted on Feb 8, 2016 @ 1:24PM
నాలుగురోజులుగా కిర్లంపూడిలో సాగుతున్న ఉద్రిక్తతకు తెరపడింది. ప్రభుత్వ ప్రతినిధులైన అచ్చెన్నాయుడు, కళావెంకట్రావులు ముద్రగడ పద్మానాభం దంపతులకు నిమ్మరసాన్ని అందించి దీక్షను విరమింపచేశారు. ముద్రగడ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని స్పష్టమైన హామీలను అందించడంతో ఆయన దీక్షను విరమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, కాపు కార్పొరేషన్‌కు ఏటా వేయి కోట్లు అందించడమే కాకుండా... కార్పొరేషన్‌కు ఇప్పటివరకూ వచ్చిన అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాపులను బీసీలలోకి చేర్చేందుకు ఏర్పాటు చేసిన మంజునాధ కమీషన్ కాలపరిమితిని కూడా వీలయినంతగా తగ్గించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో ముద్రగద దీక్షను విరమించారు. తుని సంఘటన సందర్భంగా నమోదైన కేసులు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తుని సంఘటలకు అకారణంగా ఎవరినీ బాధ్యులను చేయమనీ, దానికి సంబంధించి ఎలాంటి కఠినమైన కేసులనూ నమోదు చేయమని ప్రభుత్వం తరఫున ముద్రగడకు హామీ లభించినట్లు సమాచారం.