జగన్నాటకంలో గెలిచింది రఘురాముడేనా?
posted on May 21, 2021 @ 7:26PM
రఘురాముడు.. విజయరాముడై తిరిగొస్తున్నాడు. తన అరెస్ట్ అక్రమమంటూ.. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ పోరాడాడు. ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టినా.. అన్నిటినీ ఎడమ కాలి గాయాలతో.. ఓ తన్ను తన్నేసి.. తలెత్తుకొని బెయిల్‌పై బయటకు వస్తున్నాడు. రాజద్రోహం లాంటి నాన్-బెయిలబుల్ కేసులతో రఘురామకు సర్కారు ఉచ్చు బిగించినా.. ఆ ఉక్కు బంధనాలను సుప్రీంకోర్టు తీర్పుతో తునాతునకలు చేసేశాడు. తనను టార్గెట్ చేసి.. తనపై బలప్రయోగం చేసిన రాజ్యంపై.. ఎదురు తిరిగి.. గుండె బలంతో పోరాడి.. దెబ్బతిన్న పులిలా గర్జించి.. విజయగర్వంతో మరోసారి మీసం మెలేయనున్నారు రఘురామకృష్ణరాజు.
ప్రభుత్వం తన అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగించి.. రఘురామకు బెయిల్ రాకుండా ఎంతగా ప్రయత్నించినా.. చివరికి న్యాయం రఘురామ పక్షానే నిలిచింది. ఎంపీ రఘురామకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. బెయిల్ కోసం సుప్రీంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. హేమాహేమీలైన ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. తమ అనుభవమంతా ఉపయోగించి.. పాత తీర్పులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చి.. తుదకంటూ ప్రయత్నించారు. గంటల తరబడి జరిగిన వాదనల తర్వాత.. న్యాయదేవత చేతిలోని తరాజు రఘురామ వైపు మొగ్గు చూపింది. ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలన్నిటినీ పటాపంచలు చేస్తూ.. రఘురామకృష్ణరాజుకు సర్కారు విసిరిన వల నుంచి విముక్తి లభించింది.
రఘురామ అరెస్ట్ నుంచి.. సుప్రీంకోర్టు బెయిల్ వరకూ.. పెద్ద హైడ్రామానే నడిచింది. శుక్రవారం మొదలైన ఎపిసోడ్.. మళ్లీ శుక్రవారం నాటికి సుఖాంతమైంది. ఈ మధ్యలో మహాభారత యుద్ధంలో ఉన్నన్ని ట్విస్ట్‌లు, కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. అభిమన్యుడిలా వాటన్నిటిపై ఒంటరి పోరాటం చేసి.. అర్జునుడిలా విజయుడై.. బెయిల్ సాధించారు రఘురాముడు.
మే 14.. శుక్రవారం సాయంత్రం.. హైదరాబాద్‌లోని రఘురామ కృష్ణరాజు నివాసం.. ఉన్నట్టుండి పదుల సంఖ్యలో ఏపీ సీఐడీ పోలీసులు ఎంపీని చుట్టుముట్టారు.. సీఆర్పీఎఫ్ రక్షణలో ఉన్న రఘురామను బలవంతంగా అరెస్ట్ చేశారు.. ఒక్కసారిగా షాక్.. తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ న్యూస్..
రాజద్రోహం కేసు పెట్టి.. పుట్టిన రోజు నాడే ఆయన్ను అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ. నేరుగా గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. రాత్రంతా అక్కడే ఉంచి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు.
తెల్లారేసరికి సీన్ మరింత సితార్ అయింది. శనివారం రఘురామ అరెస్ట్ ఎపిసోడ్ మరింత కాక రేపింది. తన అరెస్ట్ అక్రమమంటూ.. బెయిల్ కోసం శనివారం ఉదయం మొదట ఏపీ హైకోర్టును ఆశ్రయించారు రఘురామ. కింది కోర్టుకు వెళ్లమంటూ హైకోర్టు సూచించడంతో.. మేటర్ మెజిస్ట్రేట్ కోర్టుకు చేరింది. అక్కడ.. అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి.. సీఐడీ ఆఫీసులో తనను తీవ్రంగా కొట్టారంటూ రఘురామ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఐదుగురు వ్యక్తులు ముఖానికి కర్చీఫ్‌లు ధరించి.. తన కాళ్లపై విపరీతంగా కొట్టారంటూ.. గాయాలను జడ్జికి చూపించారు. ఆ ఫోటోలూ బయటకు వచ్చాయి. అవి చూసి అంతా షాక్...
రఘురామ పాదాలకు తీవ్ర గాయాలు స్పష్టంగా కనిపించాయి. కాళ్లు వాచి ఉన్నాయి. గాయాలు చూసి.. మెజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు. వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి.. రఘురామ గాయాలను పరిశీలించాలని ఆదేశించారు. తొలుత జీజీహెచ్ ఆసుపత్రిలో, ఆ తర్వాత రమేశ్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించాలని ఉత్తర్వులు ఇచ్చారు. శనివారం రాత్రంతా జీజీహెచ్‌లోనే రఘురామను పరీక్షించారు వైద్యులు..కోర్టు ఒకలా ఆదేశిస్తే.. పోలీసులు మరోలా వ్యవహరించారు. ఆదివారం మధ్యాహ్నం జీజీహెచ్ నుంచి రమేశ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండానే.. నేరుగా గుంటూరు జైలుకు తరలించడం వివాదాస్పదమైంది. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి..తన భర్తను జైల్లో చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ రఘురామ సతీమణి రమాదేవి ఆరోపించడం మరింత కలకలం రేపింది.
ఆదివారం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు రఘురామ తరఫు లాయర్లు.. కోర్టు సైతం తమ ఆదేశాలను ఎందుకు దిక్కరించారంటూ సీరియస్‌గా స్పందించింది.. మరోవైపు, రఘురామ మెడికల్ రిపోర్ట్ సైతం మరింత కలకలం రేపింది. ఆయన కాళ్లు రంగు మారాయి.. వాచి ఉన్నాయి.. కానీ, అవి కొట్టడం వల్ల అయిన గాయాలు కావంటూ వైద్యులు నివేదిక ఇవ్వడం ఆసక్తికర పరిణామం.
ఇక సోమవారం.. రఘురామ ఎపిసోడ్ సుప్రీం కోర్టుకు చేరింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ శుక్రవారానికి వాయిదా పడినా.. రఘురామకు ఆరోగ్య పరీక్షలు చేసే అంశంలో మాత్రం సుప్రీం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రమేశ్ హాస్పిటల్ అంటూ రఘురామ లాయర్లు వాదించారు. మంగళగిరి ఎయిమ్స్ చాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. చివరాఖరులో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్‌ను ఫిక్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్యులు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు న్యాయ పర్యవేక్షణలో.. మెడికల్ బోర్డు రిపోర్టును షీల్డ్ కవర్‌లో ఇవ్వాలంటూ ఆదేశించి ఏపీ సర్కారుకు షాక్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం...
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఏ పోలీసులైతే రఘురామను అరెస్ట్ చేసి.. కారులో కుక్కి.. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తీసుకెళ్లారో... అదే ఏపీ పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి.. రఘురామను కారులో గౌరవంగా.. గుంటూరు నుంచి మళ్లీ హైదరాబాద్‌కు తీసుకు రావడం టోటల్ ఎపిసోడ్‌లోకే హైలైట్.. గుంటూరు జైలు ముందు కారు ఎక్కుతూ.. చేతులు ఊపుతూ.. విజయగర్వంతో కనిపించారు రఘురామకృష్ణరాజు.. కారులో కూర్చొని మీసం మెలేస్తూ.. తాను మొనగాడిననే మెసేజ్ అప్పుడే ఇచ్చారు రఘురామ..
ఈ శుక్రవారం సుప్రీంకోర్టులో రఘురామ బెయిల్ పిటిషన్, కాలి గాయాలపై విచారణ హోరెత్తింది. రఘురామ కాళ్లకు గాయాలు ఉన్నట్టు.. కేవలం గాయాలు మాత్రమే కాదు.. రఘురామ కాలి వేలికి ఫ్రాక్చర్ కూడా అయిందంటూ సికింద్రాబాద్ ఆర్మీ వైద్యుల బృందం సుప్రీంకోర్టుకు షీల్డ్ కవర్‌లో నివేదిక ఇచ్చింది. కోర్టు పర్యవేక్షకుడి సమక్షంలో, వీడియో చిత్రీకరణ మధ్య జరిగిన మెడికల్ కమిటీ పరిశీలన రిపోర్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానానికి భద్రంగా అందజేసింది. ఏపీ సీఐడీ పోలీసులు.. కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న తమ ఆరోపణలు నిజమని తేలాయని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. ఏపీ సీఐడీ అధికారుల చిత్రహింసలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ రఘురామే స్వయంగా చేసుకున్న గాయాలా? కాదా? అన్నది తెలియదన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు స్వయంగా గాయాలు చేసుకున్నారని అంటున్నారా? అని ధర్మాసనం న్యాయవాది దవేను ప్రశ్నించింది.
రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తనను సీఐడీ కస్టడీలో టార్చర్ పెట్టారని.. ఆ తర్వాతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారని రఘురామ తనతో చెప్పారని రోహత్గి అన్నారు. ఎంపీపై చాలా సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదయ్యిందని.. అందులో సెక్షన్ 124ఏ చాలా ముఖ్యమైందని తెలిపారు. రఘురామకు బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే సెక్షన్ 124ఏ కింద కేసు నమోదు చేశారని కోర్టుకు నివేదించారు రోహత్గి. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజా తీర్పుతో.. 124ఏ రాజద్రోహం లాంటి నాన్‌బెయిలబుల్ కేసులు బుక్ చేసి.. రఘురామను జైల్లోనే బుక్ చేయాలనే రాజ్యం రచించిన ఎత్తుగడ.. సుప్రీంకోర్టు ముందు పారలేదు. కాలి గాయాల బాధను పంటిబిగువన భరిస్తూనే.. బెయిల్ కోసం తీవ్రంగా పోరాడిన రఘురామ.. ఎట్టకేలకు విజయం సాధించారు. మొనగాడిలా మరోసారి మీసం మెలేశాడు.
ఒక రోజు సీఐడీ కస్టడీ.. మరో రోజు గుంటూరు జైలు.. ఆ తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్.. తాజా బెయిల్‌తో మళ్లీ ఇంటికి. ఇక్కడితోనే అయిపోలేదు సినిమా. రఘురామ ఎపిసోడ్ అటు పార్లమెంట్ సభా హక్కుల సంఘానికి చేరింది. సుప్రీంలో రఘురామ తనయుడు వేసిన పిటిషన్ అలానే ఉంది. అటు, సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ వేసిన కేసూ వేగంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికైతే బెయిల్ పై రఘురామ బయటపడ్డారు. ఇప్పుడిక.. రఘురామ దండయాత్రను జగన్‌రెడ్డి ఎలా కాచుకుంటారో చూడాలి. ఏది ఏమైనా.. వారం రోజులుగా సాగుతున్న.. రఘురామ అరెస్ట్, బెయిల్‌ను ఘటనలను చూస్తుంటే.. ఎంతైనా.. వాడు మగాడ్రా బుజ్యా.. అనిపించకమానదు. రఘురామ.. నువ్ నిజంగా మొనగాడివేరా.. ఇప్పుడు మళ్లీ తిప్పరా మీసం...