చెదలవాడకు చెరుకు రైతుల నిరసన
posted on Apr 18, 2012 @ 11:21AM
రానున్న ఉప ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయబోతున్న చెదలవాడ కృష్ణమూర్తికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ ప్రాంతంలోని వందలాది మంది చెరుకు రైతులు చెదలవాడకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దీనికి కారణం ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ప్రుడెన్షియల్ చక్కర కర్మాగారం రైతులకు బకాయిలు చెల్లించకపోవడమే. చిత్తూరు సమీపంలోని నిండ్ర మండలం ప్రుడెన్షియల్ చక్కర కర్మాగారం గత ఏడాది రైతులకు ఐదు కోట్ల రూపాలు, ఈ ఏడాది మూడు కోట్ల రూపాయలు బకాయిలు పడింది.
ఈ బకాయిలు తీర్చవలసిందిగా రైతులు ఎంత మొరపెట్టు కుంటున్నా ఫ్యాక్టరీ ఎం.డి.గా ఉన్న చెదలవాడ పట్టించు కోవడం లేదు. అయితే ఇప్పుడు చెదలవాడ తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారని తెలియడంతో చేరుకురైతులు తమ బకాయిల గురించి ఆయనకు నిలదీయటం ప్రారంభించారు. చెదలవాడ ఘుగర్ ఫ్యాక్టరీ ఎం.డి.గా చేరినప్పటి నుంచి తమకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయని రైతులు అంటున్నారు. ఒక చిన్న ఘుగర్ ఫ్యాక్టరీనే మేనేజ్ చేయలేని చెదలవాడ రాజకీయాల్లో ఏమి చేయగలుగుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధర్మాన్ని రక్షించడానికే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేసుకుంటూ తిరుపతి హజారేగా పేరు తెచ్చుకున్తానని చెదలవాడ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనను కూడా చేరుకురైతులు ఎద్దేవా చేస్తున్నారు. చెరుకు రైతులను నానా ఇబ్బందులు పెడుతున్న చెదలవాడ ధర్మాన్ని ఎలా కాపాడతారని వారు ప్రశ్నిస్తున్నారు. రైతులు నానాటికీ నిరసన స్వరం పెంచుతుండటంతో చెదలవాడ కంగారుపడుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునైనా రైతుల బకాయిలు తీర్చాలని ఆయన యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ సమస్య ఇలా కొనసాగితే ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుందని ఆయన భయపడుతున్నారు.