Read more!

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన... వైస్ ప్రిన్సిపాల్ అరెస్ట్

 

గురువంటే దైవంతో సమానంగా చూడటం మన సంప్రదాయం. పాఠాలు నేర్పే గురువు అంటే ఎంతో గౌరవం ఇస్తారు. చదువు చెప్పే టీచర్ల కంటే.. పిల్లలకు మంచి చెప్పి మంచి మార్గంలో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులకు మరింత ఎక్కువ ఉంటుంది.  అలాంటి వృత్తికే అవమానంగా నిలిచాడు  ఒక వైస్ ప్రిన్సిపాల్. విద్యార్థినులతో తప్పుగా ప్రవర్తించి  జైలు పాలయ్యాడు. హైదరాబాద్‌లోని మదీనాగూడలో ఈ ఘటన జరిగింది. 

భువనగిరికి చెందిన ముఖేష్ మదీనాగూడ నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. స్టడీ అవర్ సమయంలో చదువుకుంటున్న ఒకొక్క అమ్మాయిని పిలిచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. రోజురోజుకి అతని వేధింపులు ఎక్కువ కావడంతో విసుగు చెందిన బాలికలు ధర్నాకు దిగారు.  విద్యార్థినులను  వేధించేవాడని వాపోయారు. ఇది తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ నెల 8న అతడిపై కేసు నమోదైంది.అప్పటి నుండే ముఖేష్ పరారీలో ఉన్నాడు. అతడిపై  పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తీవ్రంగా గాలింపులు చేపట్టారు. చివరకు మంగళవారం(నవంబర్ 12) ముకేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మదీనాగూడలోని నారాయణ కాలేజీ బ్రాంచ్‌లో అతను రెండేళ్లుగా వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.