Read more!

కేరళలో హై అలర్ట్.. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం తుది తీర్పు!!

 

చారిత్రాత్మక కేసుగా పరిగణించే రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాద విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఇక దేశంమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శబరిమల తీర్పు వెలువడే రోజు రానే వస్తోంది. కేరళలోని దట్టమైన అడవుల్లో కొలువున్న అయ్యప్ప స్వామి సన్నిధికి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై ఇప్పటికే విచారణను ముగించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్.

ఈ నెల 17వ తేదీ నుంచి మండల మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు ప్రకటించింది. అప్పటినుండి అయ్యప్పస్వామి మాలను ధరించిన భక్తులు అయ్యప్ప దర్శనానికై శబరిమలకు వెళ్లడం ప్రారంభం కానుంది. అదే సమయంలో సుప్రీం తుది తీర్పును వెల్లడించనుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.

తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ సుప్రీం కోర్టులో 65 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. అన్నింటిని ఒకే కేసుగా పరిగణించి సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. తుది తీర్పును నవంబర్ 15న  వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయోధ్య భూవివాద విషయంలో జస్టిస్ గొగోయ్ హిందువులకు అనుకూలంగా తీర్పును ఇచ్చినందున.. శబరిమల విషయంలో కూడా తమకు సానుకూల తీర్పు ఉంటుందని అయ్యప్ప భక్తులు నమ్మకంతో ఉన్నారు. కేరళ దేవస్వొమ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనందున శబరిమల అయ్యప్ప ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించినట్లు కేరళ పోలీస్ డైరెక్టర్ జనరల్ లోక్ నాథ్ బెహరా తెలిపారు. భద్రత కోసం 5 దశల్లో 10,017 మంది పోలీసులను మోహరింపజేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వేలాదిమంది మహిళలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అయ్యప్ప స్వామి ఆలయానికి తామే భద్రతను కల్పిస్తామంటూ.. నీలక్కల్ నుంచి పంబ వరకు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని నిరసిస్తూ మహిళలను సన్నిధానంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యతతో పోలీసులు సైతం నిరసనలను ప్రతిఘటించారు.