Read more!

విజయవాడ ద్వారక మర్డర్ కేసులో మలుపు... వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు

 

మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. తుచ్ఛమైన కోరికలను తీర్చుకోవడం కోసం మానవత్వాన్నే మరిచిపోతున్నారు. రక్త సంబంధాన్ని... పేగు బంధాన్ని సైతం మరిచిపోయి అకృత్యాలకు పాల్పడుతున్నారు. కొందరు కన్న బిడ్డలనే కడతేర్చుతుంటే... మరికొందరు కన్నవాళ్లనే కాటికి పంపుతున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో తన బాయ్ ఫ్రెండ్స్ తో జల్సాల కోసం కన్నతల్లినే కీర్తిరెడ్డి చంపేయగా, ఏపీ రాజధానిలో దాదాపు అలాంటి ఘటనే జరిగింది.

విజయవాడలో జరిగిన చిన్నారి ద్వారక మర్డర్ వెనుక వివాహేతర సంబంధమే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. హత్యకు గురైన ద్వారక తల్లికి... నిందితుడు ప్రకాష్ మధ్య వివాహేతర సంబంధముందని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి ద్వారక హత్య జరిగిన రోజు... వీళ్లిద్దరూ పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో, నిందితుడు ప్రకాష్ తోపాటు ద్వారక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే, తన బిడ్డను చంపుకునేంత కసాయిదాన్ని కాదని ద్వారక తల్లి చెబుతోంది.

మొత్తానికి విజయవాడ చిన్నారి ద్వారక మర్డర్ కొత్త మలుపు తిరిగింది. ద్వారక తల్లి, నిందితుడు ప్రకాశ్ మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణ జరగడంతో... చిన్నారి హత్యకు వివాహేతర సంబంధమే కారణమన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ద్వారక హత్యలో కన్నతల్లి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు రావడంతో స్థానికులు విస్తుపోతున్నారు.