మోదుగులకు జగన్ పిలుపు ...నరసారావ్ పేట ఎంపీ టికెట్ ?
posted on Jan 6, 2024 @ 2:08PM
నరసారావు పేట ప్రస్తుత ఎంపి కృష్ణ దేవరాయలకు ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించడంతో ఆయన ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో చేసేదేమి లేక జగన్ మోదుగులను ఆహ్వానించారు . కృష్ణ దేవరాయలను గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించిన మరుసటి రోజే వైకాపా నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయానికి రావాలని జగన్ ఆహ్వానించారు. తనకు నరసారావు పేట మారే ఉద్దేశ్యం లేదని ఇప్పటికే కృష్ణ దేవరాయలు తేల్చి చెప్పడంతో బాటు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. నాకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. నా ఆలోచన వేరు పార్టీ ఆలోచన వేరు అని ఆయన అంటున్నారు. కాని జగన్ తన మాటే నెగ్గాలన్న ఉద్దేశ్యంతో మోదుగులకు కబురు పంపారు. నరసారావ్ పేట నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మోదుగుల 2019 వరకు టీడీపీలో కొనసాగారు. ఆయన 2009లో టిడిపి నుంచి నరసారావ్ పేట ఎంపీగా గెలిచారు. తర్వాత వైకాపాలో చేరారు. అయితే ప్రస్తుతమున్న సిట్టింగ్ ల మార్పు వల్ల వైసీపీలో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా జరుగుతున్న జగన్ కార్యకలాపాలు తీవ్ర అసంతృప్తి రాజేస్తున్నాయి. నరసారావ్ పేట ఎంపీ కృష్ణ దేవరాయలు వైకాపాను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.