అంగన్ వాడీలపై జగన్ సర్కార్ ఎస్మా ప్రయోగం
posted on Jan 6, 2024 @ 2:44PM
రెండు వారాలుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీలను జగన్ సర్కార్ ఉక్కు పాదంతో అణచి వేయాలని చూస్తోంది. అందులో భాగంగా అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఎస్మా ప్రయోగించడంతో తీవ్ర నిరసన వ్యక్తమౌతుంది.
అక్కాచెల్లెళ్లమ్మలు అన్నావు...తెలంగాణ కన్న ఎక్కువ జీతమిస్తాను అన్నావు...ఇవేనా నీ హామీలు...అని ప్రశ్నిస్తున్నారు అంగన్వాడీల కార్యకర్తలు. మాట తప్పను...మడమ తిప్పను అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి..అంగన్వాడీలకిచ్చిన మాట తప్పాడు. వారి హామీల అమలులో మడమ తిప్పాడని ధ్వజమెత్తుతున్నారు. 2 వారాలుగా హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి...ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పడం చాలా దారుణ చర్య అని ఆక్రోశిస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు అంగన్వాడీలు. మాకు అన్ని చేసిందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. అవేంటో మాకు చెప్పాలని అంగన్ వాడీలు కోరుతున్నారు. ఇలానే జగన్ సర్కార్ మెుండి వైఖరితో ఉంటే ఉద్యమం ఉధృతం చేస్తామంటున్నారు. మరి రానున్న రోజుల్లో అంగన్వాడీల కార్యకర్తల నిరసనలు తీవ్ర రూపం దాల్చి జగన్ ఓటమికి దారి తీస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న అంగన్ వాడీలను సముదాయించేదిపోయి ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వారిపై ఎస్మా ప్రయోగించారు. అంగన్ వాడీ కార్మికుల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వ పెద్దలు ముందుకు రాకపోవడంతో అంగన్ వాడీలు నిరసనగా కొండముచ్చుకు వినతిపత్రం ఇవ్వడం చూస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేవలం పదకొండు వేల రూపాయలను జగన్ సర్కార్ అంగన్ వాడీలకు ఇస్తుంది. పనికి దగ్గ వేతనం ఇవ్వాలని అంగన్ వాడీలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు లక్షా 40 వేల మంది అంగన్ వాడీలు చాలీ చాలని జీతాలతో బ్రతుకులీడుస్తున్నారు.
అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఎం తెలుస్తుంది? అని అంగన్ వాడీలు ప్రశ్నిస్తున్నారు. పేదల పక్షపాతి అని చెప్పే జగన్ అంగన్ వాడీలను రోడ్డున పడేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అని ప్రజాస్వామిక వాదులు అక్రోశిస్తున్నారు. అంగన్వాడీ ఉద్యమం పై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణమంటున్నారు. అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం జగన్ నియంత పోకడలకు పరాకాష్ట అని నినదిస్తున్నారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జిఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. జగన్ అహంకారానికి...అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదేనని రుజువు కానుంది.