జగన్ మెలో డ్రామా.. సెంటిమెంట్ పండించే యత్నం!?
posted on Jan 6, 2024 @ 1:22PM
అందరూ ఊహించినట్లే షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే ఆమె ఏపీ రాజకీయాలలో కీలకం కానున్నట్లు క్లియర్ అయిపొయింది. దాదాపుగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి అప్పగించడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే షర్మిల నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. అన్న జగన్ ను ఎదుర్కొనేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్నను విమర్శించేందుకు ఏయే అంశాలను ఎంచుకోనున్నారు అన్నది ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. షర్మిల వైఎస్ఆర్టీపీలో ఉంటూ తెలంగాణలో ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వంపై చురకలంటించారు. వైసీపీలో జగన్ తర్వాత నంబర్ 2గా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిపై నేరుగానే విమర్శలు చేశారు. అన్న జగన్ కి అయినా నా సమాధానం ఇదే అంటూ హెచ్చరించారు. అలాంటిది ఇప్పుడు షర్మిల నేరుగా ఏపీకి రాబోతుండడంతో వైసీపీపై షర్మిల విమర్శలకు పదును పెట్టడం గ్యారంటీగా కనిపిస్తుంది. అలాగే అన్న జగన్ ను సూటిగా అటాక్ చేయడానికి ఆమె ఇసుమంతైనా వెనుకాడే అవకాశాలు లేవంటున్నారు.
మరి షర్మిల వైఖరిపై వైసీపీ సమాధానం ఏంటి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఉత్కంఠభరిత అంశంగా మారింది. ఎందుకంటే గతంలో షర్మిల ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసినా వైసీపీ నేతలు నోరు మెదపలేదు.. బాబాయ్ వివేకా హత్యకేసుకు సంబంధించి షర్మిల ఢిల్లీ వెళ్లి వాంగ్మూలం ఇచ్చినా.. సొంత వారే చిన్నాన్నను కడతేర్చారని షర్మిల బహిరంగంగా చెప్పినా వైసీపీ నేతలలో ఉలుకూపలుకూ లేదు. ముందు మీది మీరు చూసుకోండని సూటిగా సజ్జల లాంటి వారికి కౌంటర్లు ఇచ్చినా వైసీపీ నుంచి కనీసం స్పందన కూడా లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు షర్మిల ఏకంగా ఏపీ వచ్చి వైసీపీపై, జగన్ పై విమర్శలు చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఒకరిద్దరు నేతలు స్పందించినా.. షర్మిల వచ్చినా తమకు ఎలాంటి నష్టం లేదన్న పొడి పొడి మాటలే వినిపించాయి తప్ప.. హీట్ పెరిగేలాంటి కామెంట్లు, విమర్శలు లేవు.
అయితే, ఇప్పటికిప్పుడు వైసీపీలో షర్మిలను టార్గెట్ చేసి విమర్శలు చేసే అవకాశం లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికను జగన్ తనపై ప్రజలలో సానుభూతి కలిగేలా మార్చుకోవాలని ఆరాటపడుతున్నట్లు వైసీపీ వర్గాలలోనే వినిపిస్తోంది. తన కుటుంబంలో చీలిక తెచ్చి తన వాళ్లనే తనపైకి ఉసిగొల్పుతున్నారంటూ విపక్షంపై ఎటాక్ చేస్తూ అదే సమయంలో తన పట్ల సానుభూతి పెరిగేలా చిన్న పాటి మెలో డ్రామాను పండించే ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు సైతం అంటున్నారు. ఒక్కొక్కరుగా తనను ఎదుర్కోలేక.. అందరూ కలిసినా సరిపోక.. ఇప్పుడు తాను ప్రాణంగా చూసుకున్న తన చెల్లితోనే తనను దెబ్బ తీసేందుకు చూస్తున్నారని ఎమోషనల్ డ్రామా పండించేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. ఇందుకోసమే ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని లాంటి వారు మీడియా ముందుకొచ్చి ఈ ఎమోషనల్ కోణాన్ని బయటపెట్టి వెళ్లారు. షర్మిల కాంగ్రెస్ చేరికపై స్పందించిన కొడాలి షర్మిలను పల్లెత్తు మాట అనలేదు. కానీ, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలో భాగమే అనేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ షర్మిల కాంగ్రెస్ చేరికను కూడా తనపై సానుభూతి కలిగేందుకు ఒక అంశంగా వాడేసుకోవడానికి రెడీ అవుతోందని అవగతమౌతోంది.
కుటుంబ పరంగా షర్మిలకు అన్యాయం జరిగింది. అన్న కోసం వెట్టి చాకిరీ చేసిన షర్మిలను అధికారంలోకి వచ్చాక కూరలో కరివేపాకులా, పూచిక పుల్లగా తీసి అవతల పారేశారు. సహజంగానే షర్మిల అన్నతో గట్టిగా విభేదించి బయటకు వచ్చారు. షర్మిలకు జగన్ అన్యాయం చేశారని నమ్మడం వల్లే తల్లి విజయమ్మ ఆమెకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే షర్మిలపై వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడితే.. అది వైసీపీకి మరింత నష్టం చేకూర్చనుంది. అందుకే షర్మిలను అడ్డం పెట్టుకొని ఆమె తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరడం ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించాలన్నది జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తుంది. అయితే, అన్నా చెల్లెళ్ళ మధ్య ఏం జరిగిందో.. ఏం జరుగుతున్నదో అందరికీ కనిపిస్తూనే ఉంది. కనుక ఇలాంటి సమయంలో జగన్ దీనిని ప్రతిపక్షాలకు ఆపాదిస్తే నమ్మే పరిస్థితి ఉండదు. కానీ, వైసీపీకి అంతకు మించి చెప్పుకొనేందుకు మరో అవకాశం లేదు. అందుకే అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నట్లు అంతా చంద్రబాబే చేస్తున్నారంటూ ప్రచారం చేయడమే జగన్ ఎంచుకున్న నినాదంగా, విధానంగా కనిపిస్తున్నది.