పలాస వద్ద లోకేష్ అరెస్టు
posted on Aug 21, 2022 @ 11:16AM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పలాస వెడుతుండగా శ్రీకాకుళం సమీపంలో హైవేపై పోలీసులు ఆయనను అడ్డగించారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా కొత్తరోడ్డు జంక్షన్ వద్ద లోకేశ్ సహా మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా పోలీసులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నారా లోకేష్, మాజీ మంత్రులు చినరాజప్ప, కళావెంకటరావు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసి జేఆర్ పురం పోలీసు స్టేషన్ కు తరలించారు. గత కొద్ది రోజులుగా పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల కిందట తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్ సూర్యనారాయణ ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా తెలుగుదేశం శ్రేణులు అడ్డుకున్నాయి.
అలాగే తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ చార్జి గౌతు శిరీష్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ తో పలాసలోని తెలుగుదేశం కార్యాలయం ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించేందుకు పలాస వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసులు వైఫల్యం చెందారనీ, తమ పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డుకోవడమేమిటని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా పలాసలో ఆదివారం (ఆగస్టు 21)ఎలాంటి ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. తెలుగుదేశం కార్యాలయం ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చన నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 21) పలాస, కాశీబుగ్గ పట్టణాల్లో నిషేధాజ్ణలు అమలులో ఉన్నాయని, అందుకే బయటవారెవరినీ పట్టణంలోనికి అనుమతించడం లేదని రాధిక తెలిపారు. కాగా లోకేష్ అరెస్టుతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.