కాంగ్రెస్ గూటికి త్రిష.. త్వరలో అధికారిక ప్రకటన?
posted on Aug 21, 2022 @ 10:53AM
ప్రముఖ హీరోయిన్ త్రిష రాజకీయ అరంగేట్రంకు రంగం సిద్ధమందా?సీనియర్ల అడుగుజాడలలో నడిచేందుకు ఆమె రెడీ అయిపోయరా? ఇటీవలి కాలంలో సినిమాలలో ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో త్రిష చూపు రాజకీయాలవైపు మళ్లిందా అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానమిస్తున్నారు. తమిళనాడులో సినిమా నటులకు రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలిసిందే.
ఎంజీఆర్ నుంచి తీసుకుంటే జయలలిత, కెప్టెన్ ప్రభాకర్, కమల్ హసన్, ఖుష్బు ఇలా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నటీనటుల జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో త్రిష పేరు కూడా చేరనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు.
తమిళనాడు కాంగ్రెస్ కు చెందిన ప్రముఖులు త్రిషతో సంప్రదింపులు కూడా జరిపారంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఖుష్బూ కూడా త్రిషను కమలం గూటికి చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. అయితే త్రిష మొగ్గు మాత్రం కాంగ్రెస్ వైపే ఉందని అంటున్నారు.
కాగా త్రిష కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయమైందని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున పోస్టింగ్ లు దర్శన మిస్తున్నాయి. అధికారికంగా త్రిష తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ ఆమె త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.