Read more!

మూఢనమ్మకాలు ముంచేస్తాయ్!

నమ్మకాలు మనిషిని బలంగా ఉంచేవి, అభివృద్ధికి దోహదం చేసేవి అయి ఉండాలి. అంతేకానీ మనిషిని పిచ్చోళ్ళలా మార్చేవి కాకూడదు. కొన్ని నమ్మకాల వెనక శాస్త్రీయ కారణాలు ఉంటాయి. వాటిని కొట్టి పడేయలేం. కానీ మరికొన్ని కారణాలు ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేకుండా కేవలం ఆచరించాలని చెబుతారు. అంతేనా వాటివల్ల మనుషులకు ఆర్థిక నష్టమే కాకుండా సమయానికి కూడా నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు జీవితంలో ఎంతో ముఖ్యమైన అవకాశాలు కోల్పోవచ్చు, మరికొన్నిసార్లు ఎంతో గొప్పవైన మానవ సంభంధాలకు నష్టం కలగచ్చు. మొత్తానికి మనుషులను మనుషుల అభివృద్ధిని సమాజాన్ని వెర్రివాళ్లను చేసే మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి. 

బయటకు వెళ్తున్నప్పుడో లేక ముఖ్యమైన పనిమీద వెళ్తున్నప్పుడో పిల్లి ఎదురయ్యిందనో లేదా భర్త చనిపోయిన ఆడవాళ్లు ఎదురయ్యారనో, చనిపోయిన శవాన్ని ఎవరో తీసుకెళ్తున్నారనో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.  చాలామంది వీటిని అరిష్టం అని అపశకునం అని అనుకుంటారు. ముఖ్యమైన పనుల కోసమో, చాలా అవసరమైన వాటికోసమో ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఎదురవ్వగానే 90% ఖచ్చితంగా తిరిగి ఇంటికి వెళ్లడం, లేదా అలా ఎదురైన తరువాత సాదారణంగానే ఎక్కడో ఒకచోట కూర్చోవడం వంటివి చేస్తుంటారు. దానివల్ల వాళ్లకు ఆలస్యం అవడం, ముందున్నంత మానసిక దృఢత్వం తరువాత కోల్పోవడం జరుగుతుంది.

ఒక్కసారి బాగా గమనిస్తే తుమ్ము వచ్చిందనో, పిల్లి ఎదురొచ్చిందనో చేసే ఆలస్యాలు, అపశకునం కాబట్టి ఏదో సమస్య ఎదురవుతుందని దానిగురించి చేసే ఆలోచనలు చెయ్యాల్సిన పనులను సరిగ్గా చేయనివవ్వు, సరిగ్గా జరగనివ్వవు. మనం చేసే ఆలస్యానికి సమయానికి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ లేదా బస్ ఎక్కడికీ వెళ్లకుండా మనకోసం స్టాప్ లోనే ఉంటాయా ఏంటి?? 

ముఖ్యమైన పనులు చెయ్యాల్సినప్పుడు మానసికంగా దెబ్బతింటే అప్పుడు చేసేపనిని సరైన ద్యాసతో చేయలేము. మనమే పనిమీద సరైన దృష్టిపెట్టకుండా ఎదురైన పిల్లుల మీద, చనిపోయిన మనుషుల మీద కారణాలు తోసేయడం ఎంతవరకు సరైనది.

కాలం మారిపోయింది మూఢనమ్మకాలు ఇప్పుడెక్కడున్నాయిలే అని అందరూ అనుకుంటారు కానీ అభివృద్ధి చెందుతున్న, ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. 

అప్పుడెప్పుడో బాగా చదువుకుని లెక్చరర్ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు కూతురిని చంపేయడం మూఢనమ్మకం అయితే తాజాగా ఒక దినపత్రికలో అష్టమి నాడు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త భార్యను హింసించడం అనే సంఘటన గురించి తెలిసినప్పుడు  ఈ సమాజంలో నమ్మకాలు ప్రజలను ఎంతగా వెర్రివాళ్లను చేస్తున్నాయో అర్థమవుతుంది.

నమ్మకాలు ఏవైనా మనిషి మానసిక స్థితిని దెబ్బకొట్టేవే. ఆ విషయం అర్ధం చేసుకున్నప్పుడు ఏదో ఎదురొచ్చిందని, మరింకేదో అడ్డొచ్చిందని ఆగిపోరు. ఎదురయ్యే జంతువుల్ని, మనుషుల్ని, సంఘటనలను చూసుకుంటూ తమ పనులను నిర్లక్ష్యం చేయరు. ప్రతిదాంట్లో మంచిని చూస్తూ ప్రతి సమస్యకు తమ నమ్మకమే బలం అని తెలుసుకున్నవాళ్ళు తాము మొదలుపెట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసుకుని కార్యశూరులు అవుతారు. అంతేకానీ మూఢనమ్మకాల మధ్య జీవితాన్ని ముంచేసుకోరు.

                                ◆ వెంకటేష్ పువ్వాడ.