విజయసాయికి మెచ్చి మేకతోలు కప్పారా?
posted on May 10, 2023 @ 10:14AM
విజయసాయి రెడ్డి తెలుగు రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూగా, జగన్ అక్రమాస్తుల కేసులో సహ నేరస్తుడిగా, ఏ2గా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంలోనూ.. జగన్ ముఖ్యమంత్రి కావడంలోనూ అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అయితే ఆ తరువాత పరిస్థితులు మారాయి.
గత ఎన్నికలకు ముందు, పార్టీ అధికారంలోకి వచ్చాకా కూడా కుడి ఎడమ భుజాలు తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయసాయి.. ఆ తరువాత పార్టీలో కనీస గుర్తింపునకు కూడా నోచుకోకుండా మరుగున పడిపోయారు. రాజ్యసభ సభ్యుడు కనుక ఢిల్లీలో షెల్టర్ తీసుకున్నారు. అక్కడే దాదాపు ఒంటరిగా తిరుగుతున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు ఆయనను కలవడానికే యిష్టపడటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎలాగో.. అణిగిమణిగి ఒండి అత్యంత విశ్వాసపాత్రుడిగా యింత కాలం పని చేసిన విజయసాయి అలాగే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.
అనువుగాని చోట మౌనమే మేలు అన్నట్లుగా యిటీవలి కాలంలో విజయ సాయి పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విజయ సాయి యిప్పుడు అసలు దాని జోలికే పోవడం లేదు. ఏదో ఒకటీ రెండూ ట్వీట్లు చేసినా అవి ప్రధాని మోడీ కార్యక్రమాలను పొగడడానికో.. లేదా విపక్ష నేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికో పరిమితమైపోయారు. అలాంటి విజయసాయికి పార్టీ అధినేత జగన్ హఠాత్తుగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో పార్టీలో విజయసాయికి మళ్లీ పూర్వ వైభవం వచ్చేసిందా అన్న చర్చ ప్రారంభమైంది.
అయితే.. పార్టీ శ్రేణులు మాత్రం ఆయనకు అంత సీన్ లేదంటున్నారు. యిప్పుడు జగన్ ఆయనను ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా నియమించారు సరే.. యింతకు ముందు వరకూ ఆ పోస్టులో బాలినేని ఉండేవారు. ఆయన దానిని తిరస్కరించిన తరువాతే విజయసాయికి జగన్ ఆ బాధ్యతలు అప్పగించారు. అంత మాత్రాన ఆయన నిజాయితీకి అదినేత మెచ్చి మేకతోలు కప్పారని కాదని పార్టీ శ్రేణులే ఉంటున్నారు. ఆ మూడు జిల్లాలకూ కోఆర్డినేటర్ అవసరం నిజానికి ఏ మాత్రం లేదని వారంటున్నారు. ఎందుకంటే ఆ మూడు జిల్లాలలోనూ యిప్పటికే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఆయన పెత్తనాన్నీ, ఆధిపత్యాన్ని తట్టుకోలేకే జగన్ కు సమీప బంధువు కూడా అయిన బాలినేని ఓ దడ్డం పెట్టి మరీ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ పదవి నుంచి వైదొలగారు. జగన్ స్వయంగా తన ప్రతినిథులను పంపి మరీ బుజ్జగించినా బాలినేని దిగి రాలేదు.
యిక గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను జగన్ సుబ్బారెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచీ సుబ్బారెడ్డికీ, విజయసాయికీ పొసగడం లేదన్న భావన పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. విజయసాకికి అప్పగించిన మూడు జిల్లాల్లో ప్రకాశం లో సుబ్బారెడ్డి వినా మరెవరూ వేలు పెట్టే అవకాశం లేదు. చిత్తూరు జిల్లా వైసీపీ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నలలోనే మెలుగుతోంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే అక్కడ సమన్వయం చేయడానికి ఏమీ లేదు. అంటే జగన్ ఏరి కోరి మరీ విజయసాయిరెడ్డికి కట్టబెట్టిన మూడు జిల్లాల కోఆర్డినేటర్ పదవి అలంకార ప్రాయం తప్పితే అక్కడ చేయడానికి ఏమీ లేదు. దీంతో విజయసాయిని మరింతగా అవమానించేలాగే ఈ నియామకం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
అన్నిటికీ మించి జగన్ తనకు కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టినట్టుగా వార్తలు వచ్చినా విజయసాయి స్పందించలేదు. అధినేతకు కృతజ్ణతలు చెప్పలేదు.దీనిని బట్టి చూస్తుంటే.. విజయసాయికి పార్టీలో ఉన్న గుర్తింపును మరింత పలుచన చేయడమే లక్ష్యంగా ఈ కొత్త పదవి కట్టబెట్టారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.