కాంగ్రెస్ ఆకాశం నుండి ఊడిపడలేదు: మైసూర

 

దేశంలో ఉన్నఅన్ని రాజకీయపార్టీలకి తానూ పెద్దన్నగా భావించుకొనే కాంగ్రెస్ పార్టీకి, వై.యస్సార్.పార్టీ నేత యమ్వి.మైసూరారెడ్డి హితబోధచేస్తూ, ముందుగా ఆదుర్లక్షణం వదిలించుకొని, అఖిలపక్ష సమావేశానికి రాకమునుపే తెలంగాణాపై తన అభిప్రాయం ఏమిటో తప్పనిసరిగా తెలియజేయాలని అన్నారు.

 

“కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను తెలంగాణాపై తమ అభిప్రాయలు చెప్పమనడం కన్నా ముందు తన మనసులో ఏముందో చెప్తే బాగుంటుంది. అయినా, ఆ పార్టీకి మా గోడు చెప్పుకొనేందుకు, అది వినేందుకు అదేమీ కోర్టులో జడ్జి కాదని తెలుసుకోవాలి. కాంగ్రేసు కూడా దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలలో ఒకటే తప్ప దానికేమి ప్రత్యేక హోదా లేదు. కాంగ్రెస్ ఏమి ఆకాశం నుండి ఊడిపడలేదు అని అది గ్రహించాలి. అందువల్ల, ముందు తెలంగాణపై తన అభిప్రాయం చెప్పడం మంచిది. అయినా, అది ఇతర పార్టీలమీద నెపంపెట్టి ఎన్నాళ్ళు ఆడుతుంది నాటకం? కాంగ్రేసుకి తెలంగాణా పరిష్కరించాలానే చిత్తశుద్ది లేదసలు. అందుకే, హోంమంత్రి మారినప్పుడల్లా మళ్ళీ అఖిలపక్షం అని కొత్తనాటకం మొదలుపెడుతుంది. ఇంత వరకు జరిగిన అఖిలపక్షం సమావేశాలలో అదేమి సాదించింది? కోట్లు ఖర్చుచేసి సోదించిన శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ని అది ఏమూలకు విసిరేసింది? తన ముందు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించకోకుండా ప్రతిపక్షాలను అఖిలపక్షం పేరుతో ఇరికిద్దామని చూస్తె అదే ముందు అందులో ఇరుక్కోక తప్పదు. ఇప్పటికయినా అది నిజాయితీగా తన మనసులో అభిప్రాయం చెప్పాలి,” అని మైసూర కాంగ్రేసుకి హితబోధచేసారు. అయితే, మరొకరి హితబోధలు వినే పరిస్తితిలో కాంగ్రెస్ ఉందా?