ఎడ్యురప్పా! నాశనమైపో గాక
posted on Dec 22, 2012 @ 7:53PM
గుజరాత్ విజయంతో మంచి ఊపుమీదున్న భారతీయ జనతా పార్టీ, అక్కడ తనకు ఎదురు తిరిగి స్వంత కుంపటి రాజేసుకొన్న కేషుభాయిపటేల్ కి చివరికి బూడిదమిగినట్లే, కర్ణాటకాలోకూడా తనకు వెన్నుపోటుపొడిచి, తన శాసనసభ్యులను ఎత్తుకుపోయి ‘కర్ణాటక జనతపార్టీ’ని స్థాపించిన ఎడ్యురప్పని ‘నువ్వు నాశనమైపోవుదువు గాకా!’ అని కసితీరా శపించిపారేసింది. గుజరాత్ లో కేషు భాయికి పట్టిన గతే నీకూ తప్పకపడుతుందని మనసారా శపించింది.
అయితే, ఆడలేక మద్దిల ఓడన్నట్లు, తన పార్టీలో ఉన్న లుకలుకలని సరిచేసుకోలేని భారతీయ జనతాపార్టీ గడిచిన నాలుగు సం.లలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చుకోవలసిన దుర్గతిలో ఉంది. ఇప్పుడు ఉన్నముఖ్య మంత్రి జగదీశ్ షట్లర్ కుర్చీకూడా ఎడ్యురప్ప గట్టిగా తుమ్మితే ఊడేలా ఉంది. అటువంటి సమయంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, గుజరాత్ లో మోడీ గెలిచేసినట్లే కర్ణాటకలో కూడా అవలీలగా గెలిచేస్తామని గొప్పలు పోతోంది. అయితే, తానూ గెలవలేకపోయినా ఎడ్యురప్పని గెలవనీయకుండా అడ్డుపడేంత శక్తి కూడా కర్ణాటకలోభారతీయ జనతాపార్టీకి లేవని దానికి తెలుసు. అయినా, మోడీ విజయాన్ని తన విజయంగా భ్రమసి భారతీయ జనతాపార్టీ తనకన్నా శక్తి మంతుడయిన ఎడ్యురప్పని గెలిచేయగలనని కలగంటోంది. గుజరాత్ ఎన్నికలలో విజయానికి తన భారతీయ జనతాపార్టీ ముద్ర కన్నా మోడీ ముద్రే ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చిందని అందరికీ తెలుసు.
తనకే గనుక ప్రజలను మెప్పించగల ఆకర్షణ శక్తి గనుక ఉంటె, అది గుజరాత్ తో బాటూ జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయుండేది కాదు. అక్కడ కూడా దాదాపు కర్ణాటకలో ఉన్న లుకలుకలే ఉండబట్టే, తన అధికారాన్ని కాంగ్రెస్ హస్త గతం చేసి బయటకు పోవలసి వచ్చింది భారతీయ జనతాపార్టీకి. మరదే దారిలో సాగుతున్న కర్ణాటకలో అది ఏవిదంగా గెలవగలనని అనుకొంటున్నదో దానికే తెలియాలి.
అదీగాక, మోడీ తన అభివృద్ధి మంత్రంతో గుజరాత్ రాష్ట్రానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు సాదించిపెడితే, కర్ణాటకలో ఇంతవరకు మారిన ముగ్గురు మంత్రులలో ఇద్దరు, తమ గనుల కుంభకోణాలతో లోకాయుక్త చేత అభిశంపబడి రాష్ట్రానికి, పార్టీకీ కూడా మాయని మచ్చమిగిల్చేరు. అందువల్ల, భారతీయ జనతాపార్టీ ముందుగా తన ఇంటిని సరిచేసుకోన్నాక, ఎదురింటి గురించి ఆలోచిస్తే మంచిది. లేదంటే, ఎన్నోఏళ్లుగా గోతి కాడ నక్కలా కర్ణాటకలో బోణీ చేయాలని ఆత్రంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ, పిట్టల పోరు పిల్లి తిని తీర్చేసినట్లు చేజిక్కిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని తన ‘హస్త’గతం చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే, దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కూడా భారతీయ జనతాపార్టీ చేతిలోంచి జారిపోతుంది. ఒకసారి కోల్పోయిన తరువాత మళ్ళీ చేజిక్కించుకోవడం అంత వీజీకాదని భారతీయ జనతాపార్టీ గానీ గ్రహించగలిగితే మంచిది.