బయోపిక్ కాదు.. రియల్ పిక్.. రామ్ గోపాల్ వర్మ
posted on Oct 27, 2022 @ 4:55PM
వివాదాస్పద దర్శకుడు రామగోపాల్ వర్మ తన కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. బుధవారం(అక్టోబర్ 26) నాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఏపీ సీఎం జగన్ తో భేటీ అనంతరం సినీ, రాజకీయ వర్గాలలో వెల్లువెత్తిన ఊహాగానాలను రామ్ గోపాల్ వర్మ గురువారం (అక్టోబర్ 27) ఫుల్ స్టాప్ పెట్టారు. తాను త్వరలో ఒక రాజకీయ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తేటతెల్లం చేశారు.
పార్ట్ వన్ పార్ట్ టూగా రూపొందనున్న తన కొత్త సినిమా బయోపిక్ కాదనీ, అంతకు మించిన రియల్ పిక్ అనీ చెప్పారు. ఈ చిత్రానికి తనతో గతంలో వంగవీటి సినిమా నిర్మించిన దాసరి కిరణ్ దర్శకుడని వెల్లడించారు. ఈ సినిమా మొదటి భాగం టైటిల్ వ్యూహం అనీ రెండో భాగం టైటిల్ శపథం అనీ వెల్లడించారు. ఈ రెండు భాగాలలోనూ రాజకీయ, అరాచకాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లలో అహంకారానికి ఆశయానికీ మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన కథే వ్యూహం అని వివరించారు. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందనీ రాచకురుపుపై వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ఉంటుందనీ వివరించారు. ఇక రెండో భాగం శపథం మరింత తీవ్రంగా ఎలక్ట్రిక్ షాక్ తగిలే లా ఉంటుందనీ రామ్ గోపాల్ వర్మ వివరించారు.
వర్మ ఏపీ సీఎం జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో బుధవారం(అక్టోబర్ 26) భేటీ అయిన సంగతి విదితమే. సీఎంతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన రామ్ గోపాల్ వర్మ ఆ మరుసటి రోజే అంటే గురువారం (అక్టోబర్ 27) రాజకీయ చిత్రం రూపొందించనున్నట్లు ప్రకటించి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
2014 ఎన్నికలకు ముందు కూడా జగన్ కు అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న చిత్రం విడుదల చేసిన సంగతి విదితమే. కాగా వర్మ తన రాజకీయ చిత్రం పై ఉహాగానాల నేపథ్యంలో బీజేపీ ఏపీ కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి బుధవారమే (అక్టోబర్26) స్పందించారు. రామ్ గోపాల్ వర్మ వ్యక్తులనూ, పార్టీలనూ టార్గెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించారనీ, మరో సారి అదే చేయబోతున్నారనీ పేర్కొన్నారు. ఆయనను ఇటువంటి సినిమాలు తీయాలని ప్రోత్సహించే వారికి రాజకీయాలలో హత్యలు ఉండవు... ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్న నానుడి అతికినట్టు సరిపోతుందని ట్వీట్ చేశారు.