తొలి స్నానంతో తనువు చాలించాడు
posted on Oct 27, 2022 @ 5:11PM
ఒక్కపూట సరిగా స్నానం చేయకుంటే మహా చిరాగ్గా ఉంటుందిరా అబ్బాయ్ అంటాడు పెద్దాయన, అబ్బా ఈ పూట కాదులేమ్మా,, రేపు తలస్నానం చస్తాలే.. అంటుంది కూతురు.. కనీసం కాళ్లన్న కడు క్కుని వచ్చి తినరా అని బతిమి లాడుతుంది కొడుకుని తల్లి.. ఇది చాలా రోటీన్.. కానీ 94 ఏళ్ల హాజీని అలా ఎవ్వరూ అడగలేదు, వేధించనూ లేదు. హాయిగా ఇన్నాళ్లూ ఒక్క మగ్గు నీళ్లు కూడా ఒంటిమీద పోసుకోకుండానే జీవించాడు. మొన్నీ మధ్యనే స్నానం చేశాడు.. అదే తొలి, ఆఖరి స్నానం అయిందా యనకి. స్నానం చేసిన కొన్ని నెలలకు మరణించాడు.
ఇరాన్ ఫార్స్ దక్షిణ ప్రాంతంలోని డెగ్జా గ్రామంలో ఊరికి దూరంగా ఒక గుట్టమీద ఎవ్వరికీ పట్టని చిన్న ఇటుకల గూడు లాంటి దానిలో ఉండేవాడు. ఆయనకు స్నానం తెలియదు, బట్టలు ఒంటి మీద ఉన్నవే. దుస్తులతో పాటు రెండు పొరల మేర మురికి పట్టి ఉండేవాడు. గత అరవయ్యేళ్లుగా ఆయన స్నానం చేయలేదంటే నమ్మండి. అందుకే ఆయన్ను అంతా లోకంలో అందరికంటే మురికి మనిషి అన్నారు.
ఆయన 60 యేళ్లుగా స్నానం చేయకపోవడానికి కారణం ఆయన యవ్వనంలో ఏవో సంఘటనల కారణంగా నీళ్లు, సబ్బుతో స్నానం చేయడం మానేశాడని డెగ్జా గ్రామస్తులు చెబుతుంటారు. ఎవరన్నా బకెట్ నీళ్లు ఇచ్చినా నిరాకరించే వాడట. ఫలితంగా ఒళ్లంతా పుళ్లుతో దారుణంగా తయారయ్యాడు. హాజీకి సిగరెట్లు తాగడం అంటే యిష్టం. ఎవరయినా అటుగా వెళ్లినపుడు ఒక్కటిస్తే పారేసేవాడు.. కనీసం నాలుగయిదు ఒక్కసారిగా పీల్చేయడం యిష్టం. హాజీ ఉన్న ప్రాంతంలో దొరికే జంతు అవశేషాలు తినేవాడట, ఆకులు చుట్టి సిగెరెట్లా తాగేవాడట. 2014లో ఒకసారి డెగ్జా గ్రామస్తులు కొందరు వెళ్లి మంచి ఆహారం, నీళ్లు ఇస్తే వాటిని చూసి భోరున ఏడ్చేశాడట. శుభ్రంగా ఉండటానికి ప్రయత్నించినా అతనికి దిగులు కమ్ముకుంటుందిట. నిజంగానే అతని జీవితంలో ఏదో ఊహించని పెద్ద సంఘటనే అతన్ని ఈ స్థితికి తీసుకువచ్చిందని అంటారంతా. కానీ ఎవరూ అడిగే ధైర్యం చేయరు, ఎవర్నీ దగ్గరికి రానీయడు.
కానీ కొన్ని నెలల క్రితం గ్రామస్తులు బలవంతంగా ఆయనకు స్నానం చేయించి, మంచి ఆహారం పెట్టి, మంచినీళ్లు తాగించారు. తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. గత ఆదివారమే మరణిం చాడు. చిత్రంగా ఉంది కదూ.. అరవయ్యేళ్ల తర్వాత మొదటిసారిగా స్నానం చేసిన ఆనందం లేదు.. అదే చివరి స్నానం అయింది.