ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై సిట్.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
posted on Oct 27, 2022 @ 4:15PM
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా భారీ ఆపరేషన్ జరిగిందంటూ వస్తున్న వార్తలపై, అధికార తెరాస చేస్తున్న ప్రచారంపై సిట్ తో దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.
ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ కోరింది. అలాగే ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ.. మొయినాబాద్ ఎపిసోడ్ లో జరిగిన పరిణామాలను గమనిస్తే తెలంగాణ పోలీసు శాఖ ఈ కేసు విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది.
ఈ కేసులో నిజానిజాలను వెలికి తీయాలంటే సిట్ విచారణ ఒక్కటే మార్గమని పేర్కొంది. కాగా బీజేపీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణ తేదీని ప్రకటించాల్సి ఉంది.