వైసీపీలోకి ముద్రగడ?
posted on Dec 20, 2023 5:21AM
కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ కానున్నారా? ముద్రగడ అధికార పార్టీ వైసీపీలో చేరనున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2019 ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ముద్రగడ తెలుగుదేశం, జనసేన పొత్తు ఉంటుందన్న చర్చ మొదలవగానే మళ్ళీ బయటకొచ్చారు. ఆ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం ఆయనపై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి నాతో పోటీ చెయ్ అని పవన్ కు ముద్రగడ సవాల్ కూడా విసిరారు. ఇక రెండు సార్లు బహిరంగ లేఖలు రాసారు. ముద్రగడ వ్యాఖ్యలు, లేఖలపై విరుచుకుపడిన జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గ ప్రజలు ముద్రగడ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు కాపు ఉద్యమం సమయంలో ద్వారంపూడి టిఫిన్లు పెట్టించారన్న ముద్రగడ వ్యాఖ్యలకు.. జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గ ప్రజలు ఇదిగో మీ ఉప్మా డబ్బులు అంటూ మనీ ఆర్డర్లు చేసి మరీ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలు పెట్టారో ముద్రగడ అటాక్ అప్పుడే మొదలైంది. ఆ తర్వాత కూడా అడపాదడపా పవన్ యాత్రల సమయంలో ముద్రగడ పలు వ్యాఖ్యలు చేశారు. కానీ, ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించలేదు.. ఆ వ్యాఖ్యలు కూడా వినిపించలేదు. కాగా, ముద్రగడ వెనక వైసీపీ వ్యూహం ఉందన్నది చాలా కాలంగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మధ్య ముద్రగడ వైసీపీలో చేరనున్నట్లు కూడా ప్రచారం జరిగింది. జనసేనపై ముద్రగడ వాయిస్ ఎప్పుడైతే రైజ్ చేయడం మొదలు పెట్టారో.. అప్పుడే వైసీపీ నేతలు ముద్రగడతో సమావేశమవ్వడం మొదలు పెట్టారు. అప్పటి నుండే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైసీపీ నేతల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఎంపీ మిధున్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడను కలవగా.. ఆ తర్వాత విశాఖ వెళ్లిన ముద్రగడ.. గాజువాకలో మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ కూడా అయ్యారు. అప్పుడే ముద్రగడ వైసీపీలోకి వెళ్లడం ఖాయమని నిర్ధారణయింది.
కాగా, ఇప్పుడు ఆ ముహూర్తం రానే వచ్చిందంటున్నారు. జనవరి 2న ముద్రగడ పద్మనాభం అధికారికంగా వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పద్మనాభం కుమారుడు చల్లారావుకు వైసీపీ నుండి టికెట్ హామీ దక్కినట్లు తెలుస్తున్నది. ముద్రగడ చల్లారావును కాకినాడ ఎంపీ, లేదా పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా రంగంలోకి దింపే అవకాశాలున్నాయి, అలాగే పెద్దాపురంలో గతంలో పోటీ చేసిన తోట శ్రీవాణి స్ధానంలో ఈసారి ఆమె భర్త తోట నర్సింహంకు జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం సీటు కూడా ఖాళీ అవుతుంది. ఈ క్రమంలోనే చల్లారావును పెద్దాపురం ఎమ్మెల్యేగా లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వారం రోజులలోనే ఈ రెండు స్థానాలలో చల్లారావును ఎక్కడ నుండి పోటీకి దింపాలన్నది ఖరారు అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతనే ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో పవన్ తెలుగుదేశంతో కలిసి పోటీకి దిగుతున్న నేపథ్యంలో కాపు ఓటును డైవర్ట్ చేసేందుకే వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడను పార్టీలో చేర్చుకుంటున్నది. ఈ వ్యూహం ఎంతవరకు వైసీపీకి కలిసి వస్తుందో చూడాలి.