తిరుమలలో మళ్లీ చిరుత కలకలం
posted on Dec 20, 2023 8:52AM
అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. నడకమార్గంలోని నరసింహస్వామా ఆలయ పరిసరాలలో చిరుత సంచారాన్ని పర్యాటకులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. చిరుత సంచారం సమాచారంతో అప్రమత్తమైన టీటీడీ నడకదారి భక్తులకు గుంపులుగా అనుమతిస్తోంది. నడకదారిలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తరచుగా అలిపిరి నడకమార్గంలో వన్యప్రాణుల సంచారంతో భక్తులు భయాందోళనలకు గురౌతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి నడకమార్గాన్ని చిరుతల అభయారణ్యంగా మార్చేసిందా? ఆ మార్గంలో భక్తులు వెళ్లాలంటే భయపడే పరిస్థితులను తీసుకువచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఏమైనా ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే కలియుగ వైకుంఠంగా భక్తకోటి భావించే తిరుమల పవిత్రతను మంటగలిపేసిన జగన్ సర్కార్ ఇప్పుడు నడకమార్గాన్ని భక్తులు వినియోగించకుండా చేసే కుట్రకు తెరలేపిందా అన్న అనుమానాలు భక్తులలో వ్యక్తం అవుతున్నాయి. కొంత కాలం కిందట చిరుత దాడిలో చిన్నారి మరణించిది. అంతకు ముందు చిరుత దాడిలో ఓ బాలుడు గాయపడ్డారు. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనల తరువాత కూడా వన్య ప్రాణులు నడక మార్గం వైపు రాకుండా కంచె నిర్మించే పనులను టీటీడీ వేగవంతం చేయలేదు. ఈ సంఘటనల తరువాత దాదాపు ఐదు చిరుతలను బంధించామని ప్రకటనలు చేసి చేతులు దులిపేసుకుంది.
ఆ తరువాత కూడా తరచుగా నడకమార్గంలో చిరుత సంచారం భక్తులలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. నడకదారి భక్తులకు ఆత్మరక్షణ కోసం చేతికర్రలు ఇస్తామని చెబుతున్న టీటీడీ వన్యప్రాణులు నడకమార్గంవైపు కాకుండా దట్టమైన అటవీ ప్రాంతం వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అసలు అలిపిరి నడక మార్గంలో సంచరిస్తున్న చిరుతల సంఖ్య ఎంత అన్న విషయాన్ని సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి నిర్ధారించే దిశగా టీటీడీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నడకమార్గంలోకి వన్యప్రాణులు చొచ్చుకు రాకుండా కంచె నిర్మాణం ప్రతిపాదన ఎప్పటికైనా కార్యరూపం దాలుస్తుందా? లేక కర్రలు ఇచ్చేశాం. ఇక మీ రక్షణ మీదే అంటు చేతులెత్తేసిందా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.