బాలినేని పక్క చూపులు.. టికెట్ హామీ దక్కితే జంపే!
posted on Dec 19, 2023 @ 4:13PM
ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలలో కీలక మార్పులు జరగనున్నాయా? ఒక మాజీ మంత్రి, పార్టీ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయన పక్క చూపులతో జిల్లా రాజకీయాలు కీలక మార్పులు ఉండనున్నాయా? ఇదే ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. గత రెండేళ్లుగా వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీలో అసంతృప్తిగా ఉంటూ సమయం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలో రెబల్ గా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతల తప్పులను ఎత్తి చూపుతూ అధిష్టానానికి కంట్లో నలుసుగా మారిపోయారు. జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారనేది ప్రధానంగా ఆయన ఆరోపణ. అలాగే సొంత పార్టీ నేతలే భారీ కబ్జాలకు పాల్పడుతన్నారన్నది మరో ఆరోపణ. అధిష్టానం పలుమార్లు బాలినేనిని పిలిచి బుజ్జగించి హామీలిచ్చింది. కానీ ఆ హామీలు నెరవేర లేదు. బాలినేని చల్లబడలేదు. దీంతో ఈ మధ్య కాలంలో పూర్తిగా రెబల్ ఎమ్మెల్యేగా మారిపోయి వాయిస్ వినిపిస్తున్నారు.
కాగా బాలినేని ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని జిల్లా రాజకీయాలలో బలంగా వినిపిస్తుంది. ఒకవైపు సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండెపి నియోజకవర్గ ఇన్ చార్జిగా మార్చారు. ఒంగోలుకు ఎవరిని నియమిస్తారన్న ఆసక్తి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. అదే సమయంలో బాలినేని వైసీపీలోనే ఉంటే.. ఆయనను ఎక్కడకి పంపిస్తారన్న చర్చ కూడా జరుగుతున్నది. అయితే ఈలోగా అసలు బాలినేనే పార్టీ ఫిరాయించడం ఖాయమన్న ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతున్నది. బాలినేని వైసీపీని వీడితే ఏ పార్టీలోకి వెళ్తారన్నది మరింత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు బాలినేని స్థాయి వ్యక్తి పార్టీ మారడం అంటే మామూలు పరిస్థితుల్లో ఆయనకు తెలుగుదేశం మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. ఒకవేళ తెలుగుదేశం వద్దనుకున్నా జనసేన మరో అప్షన్ అవుతుంది. కానీ ఇప్పడు ఈ రెండు పార్టీలు పొత్తులో ఉండడమే బాలినేనికి ఇబ్బందిగా మారినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఒంగోలు స్థానం నుండి దామచర్ల జనార్దన్ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా ఉన్నారు. దామచర్ల కుటుంబానికి తెలుగుదేశంతో విడదీయరాని బంధం. కొండెపి నియోజకవర్గానికి చెందిన జనార్దన్ తాత ఆంజనేయులు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మంత్రిగా పనిచేయగా.. కొండెపి ఎస్సీ రిజర్వుడు అయిన తర్వాత జనార్దన్ ఒంగోలుకు మకాం మార్చారు. జనార్దన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా.. గత ప్రభుత్వంలో ఒంగోలు పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టించిన నేతగా కూడా పేరుంది. గత ప్రభుత్వంలోనే మంత్రి కావాల్సి ఉండగా.. సామజిక సమీకరణాలలో భాగంగా అది వీలుపడలేదు. 2019లో జగన్ ఒక్క ఛాన్స్ గాలిలో ఒంగోలులో జనార్దన్ ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం ఇక్కడ జనార్దన్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నది ఇప్పుడున్న టాక్. మరోవైపు కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి కూడా దామచర్ల కుటుంబానికి విధేయుడు కాగా.. ఈ రెండు నియోజకవర్గాలతో పాటు కందుకూరు నియోజకవర్గాన్ని కూడా ప్రభావితం చేయగల సత్తా జనార్దన్ ది. అలాంటి జనార్దన్ ను పక్కకి పెట్టి టీడీపీ బాలినేనిని తీసుకొనే సాహసం చేయలేదు.
ఇక మిగిలింది జనసేన. బాలినేని ఒంగోలు టికెట్ హామీ ఇస్తేనే జనసేనలో చేరే అవకాశాలున్నాయి. కానీ పొత్తులో భాగంగా తెలుగుదేశం ఈ సీటు జనసేనకి వదులుకునే అవకాశాలు బహు స్వల్పం. 2024లో టీడీపీ గెలిచే స్థానం ఏదంటే అది ఒంగోలు అని బల్ల గుద్ది చెప్తాయి టీడీపీ శ్రేణులు. అలాంటి సీటును జనసేనకి వదులుకోవడం అంటే కష్టమే. అయితే ఇక్కడ ఒక అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా జనార్దన్ ఎక్కడి నుండైనా పోటీ చేసే అవకాశం ఉండగా.. ఆయనను కందుకూరు పంపించే ఛాన్స్ ఉంటుంది. కందుకూరులో ఇప్పుడు కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఇంటూరి నాగేశ్వరరావు ఇంచార్జిగా ఉండగా.. ఇక్కడ ఆయనకు ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు. జిల్లాపై దామచర్ల పెత్తనం అలాగే ఉండేలా.. మంత్రి పదవి హామీతో ఆయనను కందుకూరుకి పంపించి.. ఒంగోలు జనసేనకి కేటాయించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎంతమేర జరుగుతుందో చెప్పలేం కానీ.. ఉన్న ఒకే ఒక్క అవకాశం మాత్రం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ మేరకు బాలినేనికి హామీ దక్కుతుందా అంటే మాత్రం అనుమానమే అన్న సమాధానమే వస్తోంది.