ఆశ్రమపాఠశాలల కరిక్యూలమ్... ఎంఇసి స్థానంలో ఎంపిసి
posted on Nov 8, 2022 @ 11:33AM
సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల్లో కరిక్యూలమ్ లో మార్పు చేసేందుకు ఏపీప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో ఎంఇసీ (మాథ్స్,ఎకనామిక్స్, సివిక్స్) కి డిమాండ్ పెద్దగా లేదన్నది విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ కారణంగా దాని స్థానంలో ఎంపీసీ(మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) అలాగే బైపీసీ(బయోలజీ,ఫిజిక్స్, కెమిస్ట్రీ)లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎంఇసీ విభాగంలో సుమారు 8వేల సీట్లు మిగిలిపోవడంతో ప్రభుత్వం కరిక్యూలమ్ మార్పు నిర్ణయం తీసుకుంది.
సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల్లో పెద్దగా డిమాండ్ లేని విభాగాలను గతంలో గుర్తించి వాటి స్థానంలో డిమాండ్ ఉండే విభాగాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. పాఠశాలలు, కాలేజీలలో విద్యార్ధులు అధికంగా కోరుకుంటున్న విభాగాలకే అధిక ప్రాధాన్యతనీయాలన్నది అధికారు లు గుర్తించారు. కానీ అధికారులు ఈ విషయంలో జాప్యం చేశారని సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల , ఆశ్రమ పాఠశాలల పనితీరును మంత్రి సోమవారం సమీ క్షించారు. ఈ సందర్భంగా అధికారులను పాఠశాల, కాలేజీలలో డిమాండ్ ఉన్న విభాగంలోకి సీట్ల మార్పు అంశంలో వెంటనే చర్యలు చేపట్టాలని, వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉండేట్టు చూడాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల అన్ని బ్రాంచీల్లోనూ దాదాపు 1.17 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది సుమారు 1.09 లక్షల మంది చేరారని మంత్రి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ సీట్లకు డిమాండ్ బాగా పెరిగిందని, అందుబాటులో ఉన్న సీట్ల కంటే అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. అలాగే జిల్లాల్లో పాఠశాలల్లో మెడికల్, ల్యాబ్ టెక్నాలజీ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని అధికారులును మంత్రి ఆదేశించారు. ఈ కారణంగా భవిష్యత్తులో ఈ కోర్సులు చేసినవారికి ఉద్యోగాలు వెంటనే లభించే అవకాశం ఉంటుందన్నారు. అంతేగాక, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు పాఠశాలల కోఆర్డినేటర్లు, ప్రినిపాల్స్ కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను అమలుచేయడంలో నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకోవ డానికి వెనుకాడవద్దనీ సూచించారు.