ఓబుళాపురం కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కి క్లీన్ చిట్
posted on Nov 8, 2022 @ 12:05PM
ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను నిర్దోషిగా పరిగణించి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆమెపై ఉన్న అభియోగాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓబుళాపరం కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నా రని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ కేసు నమోదుతో ఏడాది పాటు ఐఏఎస్ అధికారిణి జైలులో గడపాల్సి వచ్చింది.
మైనింగ్ కు పాల్పడిన వారికి ఐఎఎస్ అధికారిగా శ్రీలక్ష్మి సహకరించారని ఆరోపణలతో పాటు భారీ ముడుపులు తీసుకున్నారనీ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ ఆరోపణల్లో సాక్ష్యాధారాలు లేనందున ఆమెపై అభియోగాలన్నింటినీ కోర్టు కొట్టివేస్తూ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.
1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గనుల కేటాయింపులో ఆయాచిత లబ్ధి కలిగించారన్న ఆరోపణలతో అరెస్టయి, దాదాపు ఏడాది పాటూ జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్‌లో ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని దరఖాస్తు చేసుకోగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ కేడర్‌కు రాగానే ఆమెకు పురపాలకశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.
పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి లెవెల్ 15కి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆ శాఖలోనే ముఖ్య కార్యదర్శిగా నియమించింది. వాటిని రెగ్యులర్ ప్రమోషన్లుగానే పరిగణించారు. ఆమెపై పెండిం గ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి పదోన్నతి కొనసాగింపు ఉంటుందని అప్పటి ఉత్త ర్వుల్లో ప్రస్తావించారు. ఆమెకు అబౌ సూపర్‌టైమ్ స్కేల్ (2), అపెక్స్‌స్కేల్- లెవెల్ 17కి పదోన్నతి కల్పించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దాన్ని అడ్‌హాక్ ప్రమోషన్‌గా పేర్కొన్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు తొలగి పోయాయనే చర్చ జరుగుతోంది.
కాగా...ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు.