హిమాచల్ గుమ్మంలోకి ఎన్నికలు...గూడు దాటిన కాంగ్రెస్ నాయకులు
posted on Nov 8, 2022 @ 10:42AM
అసలే ఎన్నికల సమయం అందునా దక్షిణాదిన దెబ్బతింటున్న కాంగ్రెస్ పార్టీకి ఇపుడు మరో షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం గుమ్మం వరకూ వచ్చింది అంతా యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. నినాదాల ప్లకార్డులు, జండాలు, వాహనాలు అన్నీ సిద్ధమయి నాయకులు ఇప్ప టికే అనుచరులను ఉత్సాహ పరుస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒకరిద్దరు కాదు.. ఏకంగా 26మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ లోకి దూకారు.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ తో పాటు మరో 25 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే ఇలా వారు పార్టీకి ఝలక్ ఇవ్వడం పార్టీ అధినేతకు నోటమాట రాకుండా చేసింది. ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకున్నారన్నది చర్చగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ థాకూర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికలఇన్ఛార్జి సుధాన్ సింగ్ సమక్షంలో వారంతా పార్టీ కండువా మార్చు కున్నారు.
ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి రాష్ట్రంలో పెరుగుతున్న అభిమానం, ప్రతిష్టకు విపక్షాల నుంచి కూడా నాయకులు ఆకర్షితులయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపినడ్డా ప్రకటించారు. మోదీ తో ఉంటే రాజకీయ ప్రగతి ఉంటుందన్న నమ్మకంతోనే కాంగ్రెస్ నుంచి పార్టీ లోకి వచ్చారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ ను ముందడుగు వేయించడంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అంతగా అన్నిప్రాంతాలవారినీ ఉత్సాహపరిచే స్థాయిలో లేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పట్ల విముఖత క్రమేపీ అన్ని ప్రాంతా ల్లోనూ వ్యక్తమవుతుండడంతో బీజేపీ పార్టీ అలాంటి నాయకులను, రెబెల్స్ ను ఆకట్టుకోవడంలో విజయవంత మయింది.
ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ థాకూర్ పాలన ప్రజారంజకంగా ఉందని, అన్ని పథకాలను సక్రమంగా ప్రజలకు ఉపయుక్తంగా అమలుచేస్తున్నారన్న నమ్మకం కలగడంతోనే కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి వచ్చారని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంటో అన్ని గ్రామాల్లోనూ పథకాలు బ్రహ్మాండంగా అమలు జరుగుతున్నాయని, ప్రజలు పార్టీ పట్ల, మోదీ నాయకత్వం పట్ల ఎంతో నమ్మకం చూపుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. పార్టీ వర్గాల ప్రచారం కంటే విపక్షాలను ఆకట్టుకోవ డంలో పార్టీ విజయవంతమయిందన్నది కాంగ్రెస్ నాయకులు బీజేపీ నీడన చేరడం స్పష్టం చేస్తుందని బీజేపీ నాయకులు అంటున్నారు.
కాగా నవంబర్ 12న రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సీనియర్లు పార్టీ మారడం కాంగ్రెస్ ను దెబ్బతీస్తుందనే అంటున్నారు. ముఖ్యంగా ధర్మపాల్ థాకూర్ వంటి వారు పార్టీని వీడదం పార్టీని మరింత బలహీనపరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే థాకూర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.