బెంగాల్ తర్వాత ఏపీనే టార్గెట్! జగన్ సర్కార్ కు గండమేనా?
posted on Feb 8, 2021 @ 3:39PM
ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకూడుగా వెళుతోంది. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ స్పీడ్ పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం కొత్త టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది హైకమాండ్. కాని ఏపీలో బీజేపీ పెద్దల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. సోము వీర్రాజు టీమ్ ఎంతగా ప్రయత్నించినా కమలం బండి కదలడం లేదు. బీజేపీకి బాగా కలిసి వచ్చిన హిందుత్వ ఎజెండాతో జనంలోకి చొచ్చుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా వారికి కలిసి రావడం లేదు. ఏపీలో దేవాలయాల పై జరుగుతన్న దాడులు, దేవత విగ్రహాల ధ్వంసం పై ఎక్కడికక్కడ ఉద్యమం చేస్తున్నా బీజేపీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. దీంతో ఏపీలో బీజేపీ నేతల తీరుపై హైకమాండ్ గుర్రుగా ఉందంటున్నారు.
ఏపీలోని క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. 2020 మధ్య లో ఓసారి, గడచినా జనవరిలో మరో సారి ఏపీలో బీజేపీ తీరుపై ఆయన ఒక సీక్రెట్ సర్వే చేయించారట. అందులో వచ్చిన ఫలితాలతో అమిత్ షా షాకయ్యారని తెలుస్తోంది. 2020లో చేసిన సర్వే కంటే 2021 జనవరిలో చేసిన సర్వేలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందట. ఈ సమయంలోనే ఏపీలో ఆలయాలపై దాడులు జరిగాయి. హిందుత్వ నినాదంతో కమలం నేతలు జనంలోకి వెళ్లారు. ఈ లెక్కన వాళ్ల గ్రాఫ్ పెరగాలి.. కాని సర్వేలో ఊహించని రిపోర్ట్ రావడంతో
ఏపీ బీజేపీ ముఖ్యనేతలు, పరిశీలకులకు బీజేపీ హైకమాండ్ క్లాసీ పికినట్లు చెబుతున్నారు.
దక్షిణాదిలో మరింత బలపడాలని చూస్తున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని లక్యంగా పెట్టుకుని పని చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ లైన్ లోకి వచ్చేసింది. ఏపీలో పార్టీ బలోపేతం సోము వీర్రాజ్ టీమ్ తో అయ్యేటట్లు లేదని గ్రహించిన అమిత్ షా.. స్వయంగా ఆయనే రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత అమిత్ షా.. ఏపీ రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారని చెబుతున్నారు. ఏపీలో పలు పర్యటనలకు కూడా అమిత్ షా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాదు ఏపీలో పార్టీకి బూస్ట్ ఇచ్చే లీడర్ కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఇందుకోసం ఇతర పార్టీల్లోని బలమైన నేతను గాలం వేస్తున్నారని చెబుతున్నారు. తాము అనుకున్న నేత దొరికిన వెంటనే.. అమిత్ షా యాక్షన్ లోకి దిగుతారంటున్నారు.
అమిత్ షా టీమ్ రంగంలోకి దిగిన తర్వాత.. వాళ్ల మొదటి టార్గెట్ జగన్ సర్కారే ఉంటుందంటున్నారు. 20 నెలలుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా గమనిస్తుందని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి.. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారట. ఇటీవల టీడీపీ ఎంపీలు అమిత్ షాను కలిసి ఏపీ సర్కార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు చేప్పె వివరాలను ఆసక్తిగా విన్నారట అమిత్ షా. అంతేకాదు ఆరోపణలకు సంబంధించిన అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని నిఘా వర్గాలను ఆదేశించారట. అమిత్ షా వెంటనే రియాక్డ్ కావడంతో టీడీపీ ఎంపీలు కూడా అవాక్కయ్యారని అంటున్నారు. ఈ లెక్కన ఏపీ విషయంలో బీజేపీ పెద్దలు చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ కనుక యాక్షన్ మొదలు పెడితే... జగన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏపీలో వైసీపీని చీల్చేందుకు కూడా బీజేపీ ప్రయత్నిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు, నలుగురు ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ టచ్ లోకి వెళ్లారంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నేత వైసీపీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. అతను కూడా కమలం గూటికి చేరవచ్చంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వైసీపీలో అసంతృప్త నేతలకు అమిత్ షా టీమ్ గాలం వేయవచ్చనే చర్చ జరుగుతోంది . బెంగాల్ లో గత ఏడాదిగా ఇలాగే జరుగుతోంది. అమిత్ షా డైరెక్షన్ లో విడతల వారీగా టీఎంసీ నేతలు బీజేపీలో చేరుతున్నారు. బెంగాల్ తరహాలోనే ఏపీలోనూ జరగవచ్చని చెబుతున్నారు. మమతా బెనర్డీతో పోలిస్తే జగన్ ను ఈజీగా దెబ్బ కొట్టవచ్చనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారంటున్నారు. ఎందుకంటే జగన్ పై ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఆ కేసుల ద్వారా కూడా జగన్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో.. ఏ లెక్కన చూసినా అమిత్ షా ఎంటరైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గండం వచ్చినట్లేనని రాజకీయ నిపుణులు పక్కాగా చెబుతున్నారు.