ఓ వైపు పోలింగ్.. మరో వైపు డబ్బుల పంపిణీ ..మునుగోడు ఎన్నికల సిత్రం
posted on Nov 3, 2022 @ 10:44AM
మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం (అక్టోబర్3) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఒక వైపు పోలింగ్ జరుగుతుంటే.. మరో వైపు ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు నిరాటంకంగా సాగుతున్నాయి. పోలింగ్ రోజు కూడా డబ్బుల పంపిణీ యథేచ్ఛగా కొనసాగుతోంది.
ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికను చావోరేవో గా భావించి టీఆర్ఎస్, బీజేపీలు నిబంధనలను సైతం బేఖాతరు చేసి పోలింగ్ రోజు కూడా బూత్ ల వద్ద ఓటర్లకు సొమ్ములు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 298 పోలింగ్ కేంద్రాల వద్దా మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు.
మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా మునుగోడు ఉప ఎన్నిక విధులలో ఉన్నాయి. ఇక మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందురోజైన బుధవారం ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది.
నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా మద్యం, డబ్బు పంపిణీ అయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో భారీగా నగదు, మద్యం పట్టుబడింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే నియోజకవర్గంలో మొత్తం 20 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడ్డాయి.