ముఖ్యమంత్రా, రాక్షసుడా?.. జగన్ పై చంద్ర నిప్పులు
posted on Nov 3, 2022 @ 10:24AM
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడినీ, ఆయన కుమారుడినీ అరెస్టు పేర ఈడ్చుకుంటూ వెళ్లడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. జగన్ ముఖ్యమంత్రా, రాక్షసుడా అంటూ ఫైర్ అయ్యారు. గోడలు దూకి, తలుపులు పగులగొట్టి మాజీ మంత్రిని, ఆయన కుమారుడిని అరెస్టు చేయడంపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
ఈ తీరులో ఒక బీసీ నాయకుడిని అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం (నవంబర్ 3)న విలేకరుల సమావేశంలో చంద్రబాబు జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచీ అయ్యన్న కుటుంబాన్ని వేధింపులతో వెంటాడుతోందని విమర్శించారు. ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని నాడు ఇంటి నిర్మాణాలు కూల్చి వేత మొదలు...అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.
చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. దొంగల్లా పోలీసులు ఇళ్లమీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.
వైసిపి సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీ పై బిసి నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు, అరెస్టులు సాగిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అక్రమం గా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేష్ లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చంద్రబాబు చేశారు.