అందగత్తెలిద్దరూ ఒక్కటయ్యారు!
posted on Nov 3, 2022 @ 10:53AM
చిన్నీ, పింకీ ఒక పెళ్లిలో స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఒకే కాలేజీలోనూ చదువుకుని స్నేహంగా పలకరించుకుంటు న్నారు. ఇద్దరు ఆడపిల్లలు స్నేహంగా ఉంటారు, ఆ స్నేహం కలకాలం ఉంటుందా అంటే అనుమానమే. కానీ దాన్ని బంధంగా చేసుకోవాలనుకోవడమే చిత్రం. విదేశాల్లో ఇద్దరు మహిళల వివాహాన్ని అంగీకరించడం ఉంది. మనకు వినడానికి, ఫోటో చూడ్డానికి కాస్తంత ఇబ్బందే కావచ్చు. ఇద్దరు బ్యూటీక్వీన్లు అంతర్జాతీయ స్తాయిలో పోటీకి వెళ్లి టైటిల్ కిరీటానికి తమ హోయలు, తెలివి తేటల ప్రదర్శన ఇచ్చి కిరీటం నెత్తిన పెట్టుకునేందుకు ఆరాటపడటం విన్నాం, చూశాం. కానీ వీరిద్దరూ పోటీ మాట దేవుడెరుగు మనం స్నేహితులం గనుక పెళ్లే చేసుకుంటే పోలా? అనుకున్నారు. అదే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
మిస్ అర్జెంటీనా 2020 మారియోనా పరేలా, మిస్ ప్యూరోటికో 2020 ఫాజియోలా వాలంటేన్ ఇద్దరూ చూడ ముచ్చటైన ముద్దుగుమ్ములు. వీరిద్దరూ మిస్ గ్రాండ్ ఇంటర్నేషన్ 2020 పోటీలో కలిసారు. టైటిల్ కోసం పోటీపడాలి. కిరీటం దక్కినవారికి ఉండే ఫాలోయింగ్ అంతా యింతా కాదు. వారిద్దరు టైటిల్ మాట పక్కనబెట్టుకుని మనసు విప్పి మాట్లాడేసుకోవడంలో ఒకరంటే ఒకరికి తెగ నచ్చేశారు. అంతే వారిద్దరూ ఎవ్వరూ ఊహించని నిర్ణయానికి వచ్చేశారు. టైటిల్ నువ్వు గెలిచినా, నేను గెలిచినా ఒకటే. కానీ మనం ఒక్కటవుదాం అనుకున్నారిద్దరు ముద్దుగుమ్మలు. అదేదో సరదాకి అనుకున్నారని చుట్టుపక్కలవారు నవ్వుకున్నారు. కానీ అదే నిజం చేసి చూపారు. నిజంగానే వారు వివాహం చేసుకున్నారు.
సమాజంలో ఇద్దరు మగవాళ్లు కలిసి ఉండడం, ఇద్దరు ఆడవాళ్లు కలిసి ఉండడం అనేది వినకూడని వార్తలాంటిదే. కానీ అందుకు చట్టాలు, సమాజం అంగీకరించినపుడు వారికి లేని బెడద మనకేలా అని చుట్టుపక్కలవారూ, వారి వారి స్నేహితులూ ఓకే అనేసి చాలా మామూలుగానే ఇతర స్నేహితుల్లానే కలిసిపోవడం జరుగుతోంది. కాలం మారిపోయింది. ఇద్దరి ఇష్టాలు కలిసి కాపురం చేయడానికి దారితీయి స్తున్నాయి. మొన్నామధ్య ఇంతకంటే విచిత్రం జరిగింది. ఒక మహిళ తనను తనతోనే పెళ్లి చేసుకుంది. తనను తనతోనే చూసుకోవాలన్న విచిత్ర ఆలోచన.