Read more!

ఉన్నట్టా.. లేనట్టా?.. బీజేపీ, జనసేన పొత్తు

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఒక చిత్ర మైన పరిస్థితి ఎదుర్కుంటోంది. బీజేపీ, జనసేన పార్టీల మధ్య మూడేళ్ళ క్రితం  ఎప్పుడో పొత్తు కుదిరింది. అప్పటి నుంచి రెండు పార్టీలు మిత్ర పక్షాలుగా చెలామణి అవుతున్నాయి. అయిత, 2024 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? అంటే, ఇరు పార్టీల నాయకులూ అనుమానమే అంటున్నారు.

నిజానికి  మూడేళ్ళకు పైగా రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా, ఉభయ పార్టీలు ఉమ్మడిగా చేపట్టిన కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. ఎవరి దారిన వారు, ఎవరి పంథాలోవారు రాజకీయం చేస్తున్నారు. ఈ మూడేళ్ళలో రెండు పార్టీలు ఏడడుగులు కలిసి నడిచిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కేవలం టీవీ చర్చల్లో మాత్రమే ఇరు పార్టీల ప్రతినిధులు ‘మిత్ర’ ధర్మాన్ని  పాటిస్తారు తప్ప క్షేత్ర స్థాయిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పొత్తు రాజకీయం నడుస్తోంది. ఈమధ్య కాలంలో అయితే టీవీ చర్చల్లోనూ దూరం పెరిగింది. పరస్పర దూషణలు మొదలయ్యాయి.

 ఈ నేపధ్యంలోనే ఇటీవల మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ వార్షికోత్సవ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  పొత్తుల విషయంలో, స్పష్టత ఇస్తారని అనుకున్నా, పూర్తి స్పష్టత అయితే రాలేదు.  ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉంటుందా, ఉండదా అనే విషయంలో అస్సలు క్లారిటీ రాలేదు. మరో వంక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్  టోన్ అండ్ టెనోర్  కొంత మారింది.  యాంటి హిందూ స్టాండ్ తీసుకున్నారని అనలేం కానీ, ముస్లిం మైనారిటీ అనుకూల బుజ్జగింపు ధోరణి అయితే స్పష్టంగానే బయట పడిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ముస్లిం మైనారిటీ అనుకూల స్టాండ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే  బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకే పవన్ కళ్యాణ్ ప్రో ముస్లిం మైనారిటీ స్టాండ్ తీసుకున్నారని, బీజేపీ నాయకులు అనుమానిస్తునారు.  

అదలా ఉంటే ఏపిలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ,ఎన్నికల్లో జనసేన బీజేపీకి చేయ్యిచ్చిందని, మాజీ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్ధి, బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధ‌వ్ ఆరోపించారు.  జ‌న‌సేన  బిజెపి మ‌ధ్య పొత్తు ఉన్నా లేన‌ట్లుగానే కొన‌సాగుతున్న‌ద‌ని మాధ‌వ్ సంచలన వాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా క్షేత్ర స్థాయిలో పని చేయడం లేదని స్పష్టం చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తాను స్వ‌యంగా క‌లిసి మ‌ద్ద‌తు కోరినా ఆయ‌న నుంచి స్పంద‌న క‌నిపించ‌లేద‌ని మాధవ్ అన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని ప్రచారం జరిగిందని, దీన్ని ఖండించాలని తాము జనసేన నాయకత్వాన్ని కోరామని, కానీ వారు ఖండించలేదని మాధవ్ వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ త‌మ‌తో కలిసి రావడం లేద‌ని పేర్కొంటూ జనసేన, బీజేపీ కలసికట్టుగా ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని నమ్ముతారని స్పష్టం చేశారు. 

అలాగే,మాధవ్ అధికార వైసీపీ  బీజేపీల మధ్య కొనసాగుతున్న రహస్య బంధం గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సన్నిహితంగా ఉన్నామన్న సంకేతాలను వైసీపీ ప్రజల్లోకి బలంగా పంపిందని, దాంతో ఏపీ బీజేపీ, వైసీపీ ఒకటేనని ప్రజలు నమ్మారని మాధవ్ వివరించారు. దీనివ‌ల్ల తాను ఓట‌మిపాల‌య్యాని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ఆకర్షించడంలో టిడిపి విజ‌యం సాధించింద‌ని మాధ‌వ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

 అదలా ఉంటే,ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు మంచి ప్రజాదరణ వుంది. ఆయన సభలకు వచ్చిన జనాన్ని అందరూ చూశారు. అయితే  కేవలం ప్రజాదరణ ఉన్నంత మాత్రాన ఎన్నికలలో విజయం సాధించడం అయ్యేపని కాదు. తెలుగుదేశం వంటి సంస్థాగత నిర్మాణం తోడైనప్పుడే, ఎన్నికలలో గెలుపు సాధ్యమవుతుందని  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే, తెలుగు దేశం, జనసేన జంటకు బీజేపీకి జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ తోడైతే  ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభంజనం సృష్టించొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇదే విషయం స్పష్టం చేశాయని అంటున్నారు.  బీజేపీ కలిసి రాకున్నా టీడీపీ అభ్యర్ధులు వంద శాతం విజయం సాధించిన విషయాన్ని బీజేపీ నాయకత్వం గుర్తించాలని, అంటున్నారు.