తెలంగాణ నుంచి లోక్ సభకు మోడీ?.. బీజేపీ కొత్త వ్యూహరచన?
posted on Jan 9, 2023 @ 10:01AM
తెలంగాణ అధికారమే లక్ష్యంగా బిజెపి కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈనేపథ్యంలోనే తెలంగాణ నుంచి ప్రధాని మోడిని ఎన్నికల బరిలోకి దింపేందుకు బిజెపి సన్నాహాలు చేస్తున్నట్టు ఆ పార్టీ శ్రేణుల సమాచారం. 2024 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని ప్రధాని నరేంద్ర ఇప్పటికే ఒక నిర్ణయానికి విచ్చారని చెబుతున్నారు. ఇందుకు దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను ఆయన ఎంపిక చేసుకున్నట్టు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే మోడీకి సేఫ్ నియోజకవర్గాలుగా తెలంగాణలోని రెండు లోక్ సభ స్థానాలను బీజేపీ ఎంపిక చేసినట్లు ఆ పార్టీ ఎంపీ ఒకరు తెలిపారు. ప్రధాని మోడి స్వయంగా తెలంగాణ నుంచి ఎంపీగా బరిలోకి దిగటం ద్వారా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలగా మార్చుకోవచ్చని బీజేపీ అధినాయకత్వం ఈ కొత్త ప్రణాళికను సిద్దం చేసిందని తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రధాని పోటీచేసే నియోజకవర్గంపైన బిజెపి తుది నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని సమాచారం.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే కాకుండా, కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ టార్గెట్. అదే సమయంలో ఈ మారు దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారం దక్కించుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోడి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారని చెప్పటం ద్వారా రాష్ట్రంలో పాజిటివ్ వేవ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.
తెలంగాణ లో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు.. ఆ తరువాత 2024లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రధాని మోడీ తెలంగాణలో పోటీ చేసే అంశం పైన అధికారికంగా ప్రకటనకు బీజేపీ సిద్దం అవుతోంది. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి సానుకూలత పెరుగుతుందని భావిస్తోంది. ప్రధాని మోడీ దక్షిణాదిన తమిళనాడు నుంచి పోటీ చేస్తారని ఇప్పటి వరకు ప్రచారం సాగింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణలోని రెండు లోక్ సభ స్థానాల పైన కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో రాష్ట్రంలోనే అతి పెద్ది లోక్ సభ నియోజకవర్గం.. మినీ ఇండియాగా చెప్పుకొనే మల్కాజిగిరి ఒకటి. రెండోది వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం అని అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి చెప్పుకొనే స్థాయిలో ప్రజాదరణ ఉంది. సికింద్రాబాద్ బీజేపీకి అనుకూలంమైన స్థానంగా బీజేపీ చెప్పుకుంటోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మోడీ పోటీ చేయడం ద్వారా దాదాపుగా గ్రేటర్ నగరంతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపైన ఆయన ప్రభావం బాగా ఉంటుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయటం ద్వారా ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ అనుకూలత తగ్గి.. బీజేపీకి లాభిస్తుందన్న యోచనా చేస్తున్నారు. ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయితే, అసెంబ్లీ ఎన్నికల్లోనే అదే అనుకూలంగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేసే అంశం పై బీజేపీ ఎంపీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.