జగన్ కు బీఆర్ఎస్ బిగ్ షాక్!?
posted on Jan 9, 2023 @ 9:58AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బిఆర్ఎస్ బిగ్ షాక్ ఇచ్చిందా? రాష్ట్రంలోకి రెడ్ కార్పెట్ అంటూ వెల్ కం చెప్పినా.. బీఆర్ఎస్ వైసీపీకి భారీ నష్టం చేకూరే స్టాండ్ తీసుకుందా అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. ఏపీ నుంచి చేరికలతో రాష్ట్రంలో బిఆర్ఎస్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఏపీలో ఆ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తమ పార్టీ ఉద్దేశాలు, విధానాలు, లక్ష్యాలన వెల్లడించారు.
ఆయన వెల్లడించిన అంశాలు వైసీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా మారాయి. రాష్ట్రంలో మూడు రాజధాను వివాదంపై బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటన్నది చంద్రశేఖర్ తేటతెల్లం చేశారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తోట చంద్రశేఖర్ ప్రజాభీష్టాన్నేతాము శిరసావహిస్తామని చెబుతూ.. ప్రజల్లో అధిక శాతం మంది అమరావతిలోనే రాజధాని ఉండాలనుకుం టున్నారని, తమ పార్టీ ది కూడా అదే అభిప్రాయం అని స్పష్టం చేశారు. అమరావతికే బిఆర్ఎస్ మద్దతని కుండబద్దలుకొట్టినట్టు బహిరంగంగా చెప్పారంటే, అధి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్దేశమేనని వేరే చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. మొదటి నుంచి ఇద్దరూ పరస్పర సహాకార ధోరణినే అవలంబిస్తున్నారు. అయితే రాజధాని విషయంలో మాత్రం అమరావతికే బిఆర్ఎస్ మొగ్గు చూపడంతో వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని విస్పష్టంగా తేలిపోయింది.
ఏపీలోకి అడుగుసెట్టిన భారత రాష్ట్ర సమితి లక్ష్యం తెలుగుదేశం, జనసేన ఓట్లు చీల్చి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడమేనన్న ప్రచారం ఇప్పటికే రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. తెలుగుదేశం, జనసేనతోపాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ.. తదితర పార్టీలన్నీ అమరావతి రాజధానికే మద్దతు పలుకుతున్నాయి. వైసీపీ మాత్రం కర్నూలు, విశాఖ, అమరావతి అంటూ మూడు రాజధానుల పాట పాడుతోంది. దీనిపై ఆ పార్టీకి రాజకీయ పార్టీల నుంచే కాదు, ప్రల నుంచి కూడా ఎటువంటి మద్దతూ లభించ లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్యా పలు సమస్యలు ఇప్పటికీ అపరిష్కృ తంగానే ఉన్నాయి.
ఏపీకి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాకానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, పోలవరం ప్రాజెక్టు.. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు.. లాంటివన్నింటిపై కేసీఆర్ అభిప్రాయం ఏమిటనేది స్పష్టత రావడంలేదు. తెలంగాణ వైపు నుంచి చూస్తే ఈ ప్రాజెక్టులన్నీ వస్తే తెలంగాణ కన్నా ఏపీ ముందు వరుసలో నిలబడటానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా జాతీయ పార్టీ నేతగా చూస్తే ఒక రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. మూడు రాజధానులపై తన విధానాన్ని ప్రకటించిన బీఆర్ఎస్ మిగిలిన అంశాలపై ఏ స్టాండ్ తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిందే.