బీజేపీలో చేరండి.. పాపాలు కడిగేసుకోండి.. త్రిపుర సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
posted on Jan 9, 2023 @ 10:26AM
తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ వామపక్ష నేతలకు బహిరంగ ఆహ్వానం పలికింది. త్రిపుర సీఎం మాణిక్ సాహా ఈ ఆహ్వానం పలికారు. బీజేపీని పవిత్రమైన గంగానదితో పోల్చుకున్న ఆయన.. గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయనీ, అలాగే వామపక్షాల నేతలు బీజేపీలో చేరి వారి పాపాలన్నీ కడిగేసుకోవాలని ఆయన అన్నారు.
త్రిపుర ఎన్నికలకు ముందు మాణిక్ సాహా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఎన్నికల ప్రచార సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికలలో కూడా బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని త్రిపురలో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను విశ్వసించే వారంతా పాపులేననీ, వారు తమ పాపాలను కడిగేసుకోవాలంటే బీజేపీలో చేరడం ఒక్కటే మార్గమన్న అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడిన మాటలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే ఆందోళనకు దిగుతామనీ, ఆయనను రాష్ట్రంలో తిరగనిచ్చేది లేదంటూ హెచ్చరిస్తున్నాయి.